హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కేంద్రం తీసుకురానున్న విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 8 నుంచి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. దీనిలో భాగంగా కార్పొరేట్ కార్యాలయాలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, సర్కిల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ కే ప్రకాశ్, కన్వీనర్ ఎన్ శివాజీ మాట్లాడుతూ.. విద్యుత్తు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు.
సోమవారం నుంచి విద్యుత్తు ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని తెలిపారు. అఖిల భారత విద్యుత్తు ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు మెరుపు సమ్మెకు దిగేందుకు దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. విద్యుత్తు సంస్థల ప్రతినిధులతోపాటు రైతులు, వినియోగదారులు, ఇతర భాగస్వాములతో ఎలాంటి సంప్రదింపులు జరుపకుండా కేంద్రం నిరంకుశంగా విద్యుత్తు సవరణ బిల్లును ప్రవేశపెట్టాలనుకోవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట దేశ ప్రజలంతా స్వాతంత్ర వజ్రోత్సవాలను జరుపుకొంటున్న తరుణంలో కేంద్రం నియంతృత్వంతో ప్రజా వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టడం దురదృష్టకరమన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువచేసే విద్యుత్తు సంస్థల ఆస్తులను నామమాత్రపు ధరలకే ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టనుండటం ‘అతి పెద్ద కుట్ర’ అని విమర్శించారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా తాము చేపట్టే ఉద్యమానికి భాగస్వామ్య పక్షాలన్నీ మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తుల్జారాం సింగ్, తిరుపతయ్య, గణేశ్‌రావు, షరీఫ్, ఆరోగ్యరాణి, అనిల్‌రెడ్డి, వినోద్, కరంటురావు, శ్రవణ్‌కుమార్ గుప్తా, ప్రవీణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.