Bhupalpally | రేగొండ, సెప్టెంబర్ 13 : విద్యుత్తు అధికారులు గురువారం రాత్రి నుంచి దళిత కాలనీలకు కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆయా కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో చోటుచేసుకుంది. భూపాలపల్లి ఏడీ, రేగొండ ఏఈ తమ సిబ్బందితో రేగొండ, గోరికొత్తపల్లి మండల కేంద్రాలతోపాటు పెద్దంపల్లి, నారాయణపురం, జగ్గయ్యపేట, నిజాంపల్లితోపాటు పలు గ్రామాల్లోని దళిత కాలనీలకు విద్యుత్తు సరఫరా చేసే వైర్లను తొలగించారు. దీంతో రాత్రంతా కరెంట్ లేకపోవడంతో దోమల బెడదతో నిద్ర కరువైంది దళితులు ఆవేదన వ్యక్తం చేశారు.
గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్తు పథకం అమలు కావాలంటే ప్రతి ఒక్కరూ మీటర్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ సరఫరా నిలిపివేస్తున్నారు. ఓ పక్క దళితులకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నట్టు ప్రకటిస్తూనే మరోపక్క అధికారుల చేత దాడులు చేయిస్తున్న ప్రభుత్వం తీరుపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ మీటర్ ఉంటేనే గృహజ్యోతి వర్తిస్తుందని ఏఈ కనకయ్య తెలిపారు. వారం రోజులుగా అవగాహన కల్పించినా ఎవరూ స్పందించడం లేదని పేర్కొన్నారు. అందువల్లే కరెంట్ సరఫరాను నిలిపివేసినట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రజాపాలన తెస్తామన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు అందరినీ వివిధ కారణాలతో పరేషాన్ చేస్తున్నరు. పదేండ్ల నుంచి కేసీఆర్ సర్కారు ఏనాడూ మా కాలనీలకు వచ్చి కరెంట్ కట్ చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంట్ మీటర్ తీసుకోవాలని అధికారు లు వేధింపులకు గురిచేస్తున్నరు. డబ్బు లు లేక చెల్లించకపోవడంతో మా కాలనీకి కరెంట్ కట్ చేసి మమ్మల్ని అంధకారంలోకి నెట్టారు. కరెంట్ లేక పిల్లలు చదువుకుంటలేరు. దోమల బెడద, ఉక్కపోతతో నరకయాతన అనుభవిస్తున్నాం.
– గజ్జెల రామకృష్ణ, రేగొండ