హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉపకరణాలు, సామగ్రిని అందుబాటులో ఉంచేందుకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ విద్యుత్తు సామగ్రి స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. 2023 వరకు ఐదేండ్ల కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం సచివాలయంలో భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
విద్యుత్తు గరిష్ఠ డిమాండ్ 2030 నాటికి 24,215 మెగావాట్లకు చేరుతుందని అధికారులు వివరించారు. కొత్తగా 122 ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు, 752 33/11 కేవీ సబ్స్టేషన్లను నిర్మించనున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 23 సోలరైజ్డ్ మోడల్ గ్రామాలు, రెండు సోలరైజ్డ్ మండలాలుగా మార్చనున్నట్టు రెడ్కో వెల్లడించింది. సోలార్ విద్యుత్తు ప్రస్తుతం 7,913 మెగావాట్లు ఉండగా, 2030 నాటికి 19,874 మెగావాట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంది.