హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేపట్టిన కులగణన తప్పుల తడకలా ఉన్నదని విమర్శించారు.
బీసీల జనాభా ఎలా తగ్గిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. జనగణనతో కులగణన చేపట్టాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తంచేశారు.