హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీపరంగా ఇచ్చే ప్రతిపాదనకే సర్కారు మొగ్గుచూపింది. ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం లేదని అభిప్రాయపడినట్టు తెలిసింది. సెప్టెంబర్ నెలాఖరులోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వచ్చే నెలలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు శనివారం జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికలు, 42% బీసీ రిజర్వేషన్ల
అంశాలపై పీఏసీలో చర్చ జరిగింది. దీంతోపాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై మరో డ్రామాకు సర్కారు తెరలేపింది. ఇప్పటికే కమిటీలు, ఢిల్లీలో ధర్నాలతో కాలయాపన చేస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. తద్వారా బీసీలను మరోసారి మోసగించేందుకు సర్కారు, కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏడాదిగా బీసీ రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేస్తున్నదనే విమర్శలు ఉన్నాయి.
చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమైన సర్కారు.. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో డ్రామా మొదలుపెట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై లోతుగా చర్చించేందుకు మంత్రులతో కమిటీ వేయాలని పీఏసీలో నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. పార్టీపరంగా 42% రిజర్వేషన్ కల్పించాలా? ఒకవేళ కల్పిస్తే ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలేమిటి? అనే అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ కోవిధుల సూచనలు, సలహాలను ఈ కమిటీ తీసుకోనున్నది. ఈ నెల 28 వరకు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించినట్టు తెలిపారు. ఈ కమిటీ నివేదికపై ఈ నెల 29న నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
బీసీ మంత్రుల వ్యతిరేకత
స్థానిక ఎన్నికలోల పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పిద్దామని పీఏసీలో ఓ మంత్రి ప్రతిపాదించగా, దీన్ని బీసీ మంత్రులు వ్యతిరేకించినట్టుగా తెలిసింది. ఇన్నాళ్లు కాలయాపన చేసి.. ఇప్పుడు పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామంటే బీసీల్లో వ్యతిరేకత తప్పదని తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో కొద్ది సమయం వాడీవేడిగా చర్చ జరిగినట్టు తెలిసింది. దీనిపై పార్టీ పెద్దలు కల్పించుకొని తొలుత ప్రభుత్వపరంగా ఇచ్చేందుకు కసరత్తు చేద్దామని, ఒకవేళ న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే పార్టీపరంగా వెళ్దామని చెప్పినట్టుగా తెలిసింది. దీనిపై ఓ బీసీ మంత్రి ఘాటుగా ప్రశ్నించినట్టు తెలిసింది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులపై పోటీ ఉండదని, అలాంటప్పుడు పార్టీపరంగా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు వచ్చే ఉపయోగం ఏమిటని ప్రశ్నించినట్టు తెలిసింది. కమిటీ నివేదిక, క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని బీసీలకు పార్టీపరంగానే 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.