న్యూఢిల్లీ, జూన్ 4: సార్వత్రిక ఎన్నికల బరిలో బీజేపీపై కాంగ్రెస్ గెలుపు శాతం (స్ట్రైక్ రేట్) గతంతో పోల్చుకుంటే మెరుగుపడింది. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీతో ముఖాముఖి పోరులో కాంగ్రెస్ స్ట్రైక్ రేటు 2019లో 8.3 శాతం కాగా, 2024 ఎన్నికలనాటికి అది 29శాతానికి పెరిగింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 286 స్థానాల్లో ఈ రెండు పార్టీలు ముఖాముఖి తలపడ్డాయి. దీంట్లో బీజేపీ 180 స్థానాల్ని గెలుచుకుంది. కాంగ్రెస్ 83 స్థానాల్ని కైవసం చేసుకుంది. బీజేపీపై కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ 29శాతంగా నమోదైంది. ఈసారి కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీపై కాంగ్రెస్ మెరుగైన ఫలితాల్ని అందుకుంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ కేవలం 8.3శాతానికి పరిమితమైంది. 2014 లోక్సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో ఇరు పార్టీలు ముఖాముఖి పోటీపడ్డాయి. దీంట్లో కేవలం 36 స్థానాల్ని (స్ట్రైక్ రేట్ 9.7శాతం) కాంగ్రెస్ గెలుచుకున్నది.