బుల్డోజర్ వ్యాఖ్యలపై ఆగ్రహం
24 గంటల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 16: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఓటర్లను బెదిరించడంపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేస్తాం’ అంటూ రాజాసింగ్ మంగళవారం వీడియో విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ‘ఇప్పటికే యూపీలో వేల సంఖ్యలో జేసీబీలను, బుల్డోజర్లను యోగి తెప్పించారు. యోగికి ఎవరెవరు ఓటు వేయలేదో వారిని ఎన్నికల తరువాత గుర్తిస్తాం. జేసీబీ, బుల్డోజర్లు ఎందుకువస్తాయో మీకు తెలుసు కదా. యూపీలోఉండాలని అకొంటున్నారా..లేదా? బిడ్డా..యోగి అధికారంలోకి రాకపోతే మీరంతా యూపీని వదిలి పారిపోవాలి’ అని రాజాసింగ్ హెచ్చరించారు. రాజాసింగ్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకొన్న కేంద్ర ఎన్నికల సంఘం మరుసటి రోజే నోటీసులు జారీచేసింది. గడువులోగా స్పందించపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆదేశాలు బేఖాతరు
ఏడు విడుతల్లో జరుగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు విడుతల పోలింగ్ పూర్తయింది. తొలి రెండు విడుతల్లో జరిగిన బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపులకు దిగారు. కాగా, ఈసీ ఆదేశాలను రాజాసింగ్ బేఖాతరు చేశారు. తాను రాజస్థాన్లోని ఉజ్జయినిలో ప్రత్యేక పూజలు, యజ్ఞం చేస్తున్నానని, పూజలు అయిపోవడానికి మూడు రోజులు పడుతుందని, ఆ తర్వాతే నోటీసులకు వివరణ ఇస్తానని అన్నారు.
రాజాసింగ్లో అద్భుత హాస్యనటుడు: కేటీఆర్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్లో అద్భుతమైన హాస్యనటుడు కనిపించాడని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు బుధవారం అన్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటు వేయకపోతే ఇండ్లపైకి బుల్డోజర్లను పంపిస్తామని ఇటీవల రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఈ మేరకు స్పందించారు.