హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలిలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో రెండు ఉపాధ్యాయ స్థానాలు కాగా, ఒకటి గ్రాడ్యుయేట్ స్థానం ఉన్నాయి. వీటి ఎన్నికకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్‌ను వచ్చేనెల 3న విడుదల చేయనున్నట్టు ఈసీ బుధవారం వెల్లడించింది. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
ప్రస్తుతం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి జీవన్‌రెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కే రఘోత్తమ్‌రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురి పదవీ కాలం మార్చి 29తో ముగియనున్నది. ఈ క్రమంలోనే మార్చి 8వ తేదీలోగా ఈ మూడు స్థానాల ఎన్నికకు లాంఛనాలు పూర్తిచేయనున్నట్టు ఎన్నికల సంఘం షెడ్యూల్లో స్పష్టం చేసింది. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈడీ షెడ్యూల్లో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా నియోజకవర్గాల్లో రెండు పట్టభద్రుల స్థానాలకు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాలోని ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలను నిర్వహించనున్నట్టు వెల్లడించింది.