హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించే విషయంలో భారత ఎన్నికల సంఘం నేడు ప్రపంచానికి స్వర్ణ ప్రామాణికంగా నిలిచిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. కఠిన శ్రమ, సంపూర్ణ పారదర్శకతతోనే భారత్ ప్రజల విశ్వాసాన్ని సంపాదించినట్టు పేర్కొన్నారు. యూరప్ పర్యటనలో భాగంగా సీఈవో నేతృత్వంలోని బృందం బుధవారం బ్రస్సెల్స్‌లో ఎఫ్‌పీఎస్ ఇంటీరియర్ డైరెక్టర్ జనరల్ హెచ్ఈ అన్నబెల్ హాగెమాన్తోపాటు యూరోపియన్ పార్లమెంట్ ఉన్నతాధికారులను కలిసింది. ఈ సందర్భంగా భారత ఎన్నికల వ్యవస్థ ప్రపంచస్థాయిలో ఎలా ఒక ప్రామాణికంగా నిలిచిందో వివరించారు.
2024- 25 ఎన్నికల చక్రంలో దేశవ్యాప్తంగా దాదాపు 97.9 కోట్ల మంది ఓటర్ల కోసం ఎన్నికలు నిర్వహించామని, ఇందుకోసం 2 కోట్ల మందికిపైగా సిబ్బందిని వినియోగించామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల కసరత్తుగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటర్ల జాబితాను భారత్ నిర్వహిస్తున్నదని వివరించారు. జనవరి 2025లో ప్రచురించిన పేర్లలో 2 కోట్ల క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిషరించామని, చివరికి 89 అప్పీలు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. రాజకీయ పార్టీలు, బూత్‌స్థాయి ఏజెం ట్లు ఈ ప్రక్రియలో సమాంతర ఆడిటర్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ, చట్టపరమైన పరిమితుల్లో వేలమంది జనరల్, పోలీస్, వ్యయ పరిశీలకుల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఓటర్లు, అభ్యర్థుల కోసం అనేక డిజిటల్ యాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన తెలిపారు.