సిద్దిపేట, నవంబర్ 30 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకవైపు పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి అధికారిక కార్యక్రమాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఎన్నికల్ కోడ్ వర్తించదా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 3న సీఎం పర్యటన ఖరారైంది. ఆ రోజున భారీ బహిరంగసభ నిర్వహించడంతోపాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రూ.480 కోట్ల నిధులతో చేపట్టే పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని అధికారులు, స్థానిక నాయకులు ప్రకటించారు.
ఇందుకు ఎన్నికల కోడ్ నిబంధనలు వర్తించవా? అనే చర్చ ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతున్నది. కోడ్‌ను ఉల్లంఘిస్తూ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పేరుకు హుస్నాబాద్ మున్సిపాలిటీలో సీఎం సభా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ అంతా గ్రామీణా ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులే కావడం గమనార్హం. హుస్నాబాద్ పట్టణంలో రూ.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు, ఇంజినీరింగ్ కళాశాల భవనానికి, ఆర్టీవో కార్యాలయ భవనానికి, టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై అభ్యంతరాలు లేకున్నా.. వివిధ గ్రామాల పరిధిలో చేపట్టే పనులకు శ్రీకారం చుట్టడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామీణ పనులపై అభ్యంతరాలు
హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో వివిధ గిరిజన తండాలను కలుపుతూ రూ.16.60 కోట్లతో నిర్మించే బీటీ రోడ్ల నిర్మాణానికి ఇదే సందర్భంగా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీని ప్రభావం గిరిజన తండాలపై ఉంటుంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఆయా గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కోహెడ మండలంలో రూ.200 కోట్లతో నిర్మించే యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ, చిగురుమామిడి మండలం సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు రూ.77 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి, రూ.68.91 కోట్లతో హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట మండల కేంద్రం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి కూడా సీఎం శంకస్థాపన చేయనున్నారని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రకటించారు.
దీంతో చిగురుమామిడి, కోహెడ, అక్కన్నపేట మండలాల్లోని గ్రామీణ ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. సీఎం పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పంపిణీలు దాదాపు గ్రామీణ ప్రాంతాలవే అధికంగా ఉన్నాయి. ఇదంతా కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా జరుగుతుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మూడో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందేందకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు దిగజారుతుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా జిల్లా అధికార యంత్రాంగం సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ ఏర్పాట్లపై హుస్నాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏకంగా సమీక్ష సైతం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసమే ఇదంతా జరుగుతున్నదని జోరుగా చర్చ జరుగుతుంది.