హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదలచేసింది. హైదరాబాద్ ఏసీగార్డ్స్‌లోని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. తొలుత రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు (సర్పంచ్, వార్డుసభ్యులు) ఎన్నికలు నిర్వహిస్తామని
తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల తొమ్మిదో తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు. ఆ రోజు నుంచే తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తొలి విడత పోలింగ్‌ను అక్టోబర్ 23న, రెండో విడత పోలింగ్‌ను 27న నిర్వహిస్తామని చెప్పారు. వీటి ఫలితాలను మాత్రం నవంబర్ 11న ప్రకటిస్తామని వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు తొలివిడత పోలింగ్ అక్టోబర్ 31న, రెండోవిడత పోలింగ్ నవంబర్ 4న, మూడో విడత పోలింగ్ నవంబర్ 8న నిర్వహిస్తామని చెప్పారు. పోలింగ్ పూర్తయిన అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని వివరించారు.
1,12,474 పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ రాణికుముదిని వెల్లడించారు. 565 జడ్పీటీసీ, 5,749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయని, ఇందుకోసం 31,300 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు. 12,733 గ్రామ పంచాయతీలకు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరిపేందుకు 1,12,474 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం గ్రామీణ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్టు వివరించారు. ఇందులో పురుషులు 81,65,894 మంది, మహిళలు 85,36,770 మంది, ఇతరులు 504 మంది ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పురుషులకంటే సుమారు 3.7 లక్షల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సమావేశంలో డీజీపీ జితేందర్, అదనపు డీజీ మహేశ్‌భగవత్, పంచాయతీరాజ్శా ఖ ముఖ్యకార్యదర్శి ఎన్ శ్రీధర్, డైరెక్టర్ సృజన, ఎన్నికల కమిషన్ కార్యదర్శి మంద మకరంద్ తదితరులు పాల్గొన్నారు.
మొత్తం ఐదు విడతలు ఇలా..
31 జిల్లాలోని 53 రెవెన్యూ డివిజన్లు, 292 మండలాల పరిధిలోని 2,963 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. 50 రెవెన్యూ డివిజన్లు, 273 మండలాల పరిధిలోని 2,786 ఎంపీటీసీ స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే 31 జిల్లాలోని 17 రెవెన్యూ డివిజన్లు, 77 మండలాల పరిధిలోని 1,998 గ్రామ పంచాయతీలు, 17,110 వార్డులకు తొలివిడతలో ఎన్నికలు ఉంటాయి. 49 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల పరిధిలోని 5,414 గ్రామ పంచాయతీలు, 47,890 వార్డులకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. 51 రెవెన్యూ డివిజన్లు 242 మండలాల పరిధిలోని 3,321గ్రామ పంచాయతీలు 47,788 వార్డులకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయి.
14 ఎంపీటీసీ, 27 గ్రామాలకు ఎన్నికలు లేవు
కేసులు పెండింగ్‌లో ఉన్నందున కొన్ని ఎంపీటీసీ స్థానాలు, గ్రామ పంచాయతీలు, వార్డులను నోటిఫికేషన్ నుంచి మినహాయించినట్టు రాణికుముదిని చెప్పారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీలకు, 25 గ్రామాలకు, 230 వార్డులకు ఎన్నికలు నిర్వహించడంలేదని తెలిపారు. కరీంనగర్ జిల్లా వీ సైదాపూర్ మండలంలోని రెండు గ్రామాలకు, 16 వార్డులకు ఎన్నికలు నిర్వహించడంలేదు.
బ్యాలెట్ పేపర్ ఓటింగ్
స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తామని రాణికుముదిని చెప్పారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా బ్యాలెట్ బాక్సులు తెప్పించి జిల్లాలో రెడీగా ఉంచినట్టు వెల్లడించారు.
ముగ్గురు పిల్లలు ఉన్నవారు అనర్హులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులుగా మారారు. గతంలో ఇద్దరి కంటే ఎ క్కువ మంది సంతానం ఉన్న వ్యక్తులు స్థా నిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్రంలో 1995లో నాటి చంద్రబాబు ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అయితే, ఏపీలో మాత్రం ముగ్గురు పిల్లలు నిబంధనను తొలగించారు. కానీ, తెలంగాణలో మాత్రం ముగ్గురు పిల్లల నిబంధన మారలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న గ్రామీణ ఓటర్ల వివరాలు