నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 25 రోజుల పాటు ఆయా పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. రోడ్ షోలు, ర్యాలీలతో మునుగోడు సందడిగా మారింది. మొత్తంగా ప్రచార సమయం ముగియడంతో.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆయా పార్టీల నేతలు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు ఖాళీ అయ్యాయి.
ఈ ఉప ఎన్నిక పోరులో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తంగా 47 మంది బరిలో ఉన్నారు.
ఈ నెల 3వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. 5,686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నప్పటికీ, కేవలం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 298 ఏర్పాటు చేశారు. అర్బన్‌లో 35, రూరల్‌లో 263 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఓటరు స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తయింది. ఆన్లైన్లో కూడా ఓటరు స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తొలిసారి కొత్త నమూనా ఓటరు కార్డులను పంపిణీ చేశారు.