రాయపర్తి, ఏప్రిల్ 18: కోతుల దాడిలో గాయపడ్డ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడులో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దూరిశెట్టి మల్లమ్మ(75) ఈ నెల10న స్నానం చేసేందుకు వేడినీళ్ల బకెట్ తీసుకొని బాత్రూమ్కు వెళ్తున్నది. ఈ క్రమంలో కోతుల గుంపు ఆమెపై దాడిచేయడంతో బకెట్‌లోని వేడినీళ్లు వృద్ధురాలిపై పడి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు తొర్రూరులోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించి, చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించి మృతి చెందింది. మల్లమ్మకు భర్త యాకయ్యతో పాటు కుమారుడు రాజు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు.
కంది సెంట్రల్ జైలులో ఖైదీ మృతి ; గుండెపోటుతోనేనన్నజైలు అధికారులు
కంది, ఏప్రిల్ 18: సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన ఇజ్మల వెంకట్ (39) గంజాయి కేసులో నిందితుడిగా ఈ నెల 3న కంది సెంట్రల్ జైల్లో రిమాండ్‌కు వచ్చాడు. ఈ నెల 17 గురువారం రాత్రి అతడికి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. మళ్లీ అర్ధరాత్రి ఒక్కసారిగా కింద పడిపోవడంతో పరీక్షించిన జైలు వైద్యులు, సిబ్బంది వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం ఖైదీ మృతికి గుండెపోటు కారణమా, మరేదైనా? అనే విషయం తెలుస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఖైదీ వెంకటేశ్వర్ మృతిపై కుటుంబ స భ్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నా రు. శుక్రవారం ఉదయం సంగారెడ్డి దవాఖాన వద్దకు చేరుకున్న వారి రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. మృతదేహం వద్దకు తమను ఎందుకు పంపడం లేదని, మృతిపై తమకు అనుమానం ఉందని ఆరోపించారు.