హైదరాబాద్ : పోలీసు అమరవీరుల సంస్మరణ (Police Commemoration Day ) దినోత్సవం నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీజీపీ సి. వి. ఆనంద్ ( DGP Anand ) అధికారులను ఆదేశించారు. అక్టోబరు 21న గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి సంబంధించి సోమవారం స్టేడియాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు.
సభా వేదిక నిర్మాణం, ప్రముఖుల రాకపోకలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జన సమూహాన్ని దృష్టిలో ఉంచుకుని మార్గాలను స్పష్టంగా గుర్తించాలని, వివిధ విభాగాల మధ్య సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, స్టేడియంలో కొనసాగుతున్న వివిధ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. 48 గుర్రాలకు వసతి కల్పించే ఆధునిక అశ్వశాల సముదాయం, పోలీసు జాగిలాల కెన్నెల్స్, ఐదు అంతస్తుల సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) భవనం, క్రీడా మైదానాలు, అథ్లెటిక్స్ సదుపాయాల నిర్మాణాలను పరిశీలించారు. వచ్చే ఏడాది అక్టోబరు నాటికి స్టేడియం సముదాయాన్ని అన్ని సదుపాయాలతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు.