హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎల్నినో ఛాయలు ప్రారంభమైనట్టు కనిపిస్తున్నది. ఈ ఏడాది వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా ఒక్క భారీ వర్షం పడకపోవడమే ఇందుకు నిదర్శనం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అడపాదడపా కురిసిన వర్షాలకు వేసిన విత్తనాలు సరైన వానలు లేక మొలకెత్తలేదు. మొలకెత్తినవీ సరిపడా పదును లేక వాడుబడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎల్నినో ప్రభావంతో ఈసారి రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాలు మంగళవారం గుజరాత్, రాజస్థాన్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని, దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించారు. దేశంలోని 724 జిల్లాల్లో 315 జిల్లాలు తీవ్ర వర్షాభావానికి గురవుతాయని పేర్కొన్నారు.