హైదరాబాద్, ఫిబ్రవరి1(నమస్తే తెలంగాణ): దేశంలోని ైస్పెసెస్, టీ, రబ్బర్ బోర్డులకు బడ్జెట్లో నిధులు కేటాయించిన కేంద్రం, పసుపు బో ర్డుకు మాత్రం నయాపైసా ఇవ్వకపోవడం విడ్డూరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రాష్ట్రం నుంచి బీజేపీ, కాంగ్రెస్కు చెరో 8 మంది ఎం పీలున్నా సాధించింది గుండు సున్నా అని ఎద్దేవాచేశారు. ఇన్నాళ్లూ పసుపు బోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకొన్న బీజేపీ ఎంపీలు ఇప్పుడు ఏం సమాధా నం చెప్తారని శనివారం ఎక్స్ వేదికగా నిలదీశారు. కేంద్రం పసుపుబోర్డుకు మొండిచెయ్యి చూపి నిజామాబాద్ రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. బడ్జెట్ను చూస్తుంటేనే తెలంగాణపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతున్నదని, బడేభాయ్.. చోటేభాయ్ కలిసి రాష్ర్టానికి తీరని అన్యా యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకూ నిధులివ్వకపోవడం,మేడారం సమ్మక్క జాతరకు జాతీయహోదా ఇవ్వకపోవడం చూస్తుంటే బీజేపీకి తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నది తేలిపోయిందన్నారు.