Cabinet Expansion | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ఆ ముగ్గురు మంత్రులు బలిపీఠానికి చేరువలో ఉన్నారా? మంత్రివర్గ విస్తరణలో వారికి అప్రధాన శాఖలు అంటగట్టబోతున్నారా? లేక అసలుకే ఎసరు వస్తుందా? అంటే ‘అవును ’అనే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. త్వరలో జరగబోతున్న మంత్రివర్గ విస్తరణలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మరో మంత్రికి అప్రధాన శాఖలను అంటగట్టేందుకు రంగం సిద్ధమైనట్టు కాంగ్రెస్ శ్రేణులో ప్రచారం జరుగుతున్నది. వీరిలో ఇద్దరు మొదటినుంచీ కాంగ్రెస్ వాదులైన సీనియర్ దళి త మంత్రులు కాగా, మరొకరు మొన్నటి వరకు ముఖ్య నేతకు అత్యంత నమ్మకస్తుడిగా, రాష్ట్రంలో నంబర్ 2 మంత్రిగా చెప్పుకున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కమీషన్లు, శాఖల్లో పైరవీలు, వివాదాస్పద భూముల సెటిల్మెంట్లు, కబ్జాలు తదితర ఆరోపణల నేపథ్యంలో వారిని కీలక శాఖల నుంచి తప్పించి, అప్రధాన శాఖలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నది.
ఖమ్మం జి ల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల్లో ఒకరు 20% మంత్రిగా, మరొకరు 30% మంత్రిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సెక్రటేరియట్లోనే ఒక మంత్రి చాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు ధర్నా చేసిన నేపథ్యంలో ఢిల్లీ అధిష్ఠానం సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఈ సంఘటనపై ఢిల్లీ దూత ఒకరు హైదరాబాద్కు వచ్చి విచారణ చేసి వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భూముల వ్యవహారాలు చక్కబెట్టిన ఒక మంత్రి ప్రతి పనిలోనూ 30% వాటా తీసుకున్నట్టు అధిష్ఠానం వద్ద ఆధారాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది. అతి తక్కువ కాలంలో బలమైన ఆర్థికశక్తిగా ఎదిగిన ఆ మంత్రిని పూర్తిగా తప్పించే ఆ లోచనతో అధిష్ఠానం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రిపై కూడా ఉద్యోగుల బదిలీలు, డిప్యూటేషన్లు, పరికరాల కొనుగోళ్లలో పర్సెంటేజ్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఢిల్లీ అధిష్ఠానానికి చేరినట్టు గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ ముగ్గురిపై వేటు తప్పదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
సీనియర్ మంత్రి ఒకరు ప్రస్తుతం త నకున్న ఒక శాఖను వద్దంటే వద్దని చెప్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ఆ శాఖ, ఇప్పుడు తనకు గుదిబండ తీరుగా ఉన్నదని నేరుగా ఢిల్లీ అధిష్ఠానానికే ఆయన చెప్పినట్టు కాం గ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూలుడు, కుంగుడు, కేసులు, క మిషన్ల గొడవలు తప్ప మరో పనే లేదని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. నిరుడు ఆ శాఖకు రూ.వేల కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారని, ఇప్పుడు ఆ శాఖకు అరకొర నిధులే కేటాయిస్తున్నారని, శాఖను తొలగించి మరో కీలకమైన శాఖ ఇవ్వాలని ఇప్పటికే ఆయన అధిష్ఠానాన్ని కోరినట్టు తెలిసింది. మొత్తానికి నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పుల మీద కసరత్తు చేస్తున్నట్టు, ఇందులో ఇద్దరికి అసలుకే ఎసరు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.