హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్చకులు, అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ హామీ ఇచ్చారు. ఉద్యోగభద్రత కల్పించడంతోపాటు గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఇప్పించేందుకు సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామని తెలిపారు. బుధవారం సికింద్రాబాద్‌లో రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) రాష్ట్రస్థాయి సదస్సులో రాజేందర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలోని అర్చకులు, అర్చక ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని కొనియాడారు. ఆలయాలకు ధూప, దీప, నైవేద్యంకోసం నిధులు మంజూరు చేస్తున్నారని గుర్తుచేశారు. జీవో 577 ద్వారా 3 వేలమంది అర్చక ఉద్యోగులకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. ఇంకా 2,625 మందికి ఈ సౌకర్యం కల్పించడంతోపాటు ధూప, దీప, నైవేద్య పథకం అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. జేఏసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ.. బ్రాహ్మణుల సంక్షేమానికి కృషిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని ప్రశంసించారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా బ్రాహ్మణులు, అర్చకుల ఆశీర్వాదంతో 2023లో మళ్లీ కేసీఆరే పాలనాపగ్గాలు చేపడతారని చెప్పా రు. 32 జిల్లాలనుంచి 500 మందికిపైగా అర్చకులు, అర్చక ఉద్యోగులు సదస్సుకు తరలివచ్చారు. జేఏసీ నాయకుడు పరాశరం రవీంద్రాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ప్రతాప్, అర్చక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి, ముఖ్య కార్యదర్శి బద్రీనాథ్చార్యులు, ప్రధాన కార్యదర్శి మాదారం యాదగిరి, ధూప, దీప, నైవేద్య అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసశర్మ, గౌరవాధ్యక్షుడు సతీశ్‌శర్మ, వేణుగోపాలాచార్యులు, రత్నాకర్, వీరభద్రశర్మ, బల్కంపేట ఎల్ల మ్మ దేవాలయం ఈవో అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.