హైదరాబాద్ : వైదిక ధర్మాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో.. వనస్థలిపురం సచివాలయం కాలనీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తెలంగాణ వేద విద్వన్మహా సభలను మంత్రి గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ..గొప్ప భక్తుడు, ధార్మిక సేవా తత్పరుడైన సీఎం కేసీఆర్ సారధ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. వేద పండితులకు తెలంగాణ ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతను ఇస్తుందని పేర్కొన్నారు.
దేవాలయంలో పనిచేస్తున్న అర్చకులు, సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్న ఘనత తెలంగాణ సర్కార్‌దే అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచీన దేవాలయాల అర్చకులకు ధూప, దీప నైవేద్య పథకం కింద గౌరవ వేతనాలు అందిస్తున్నట్టు తెలిపారు. ధార్మిక, ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు దేవాదాయ శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా వేద పండితులకు భృతి, వేద పాఠాశాలలకు గ్రాంట్, వేద విద్యార్థులకు పారితోషికాలు అందిస్తున్నామని తెలిపారు. వేద పరిరక్షణ, వేద ధర్మాన్ని పునరుజ్జీవింప చేయడంలో శ్రీ జనార్దనానంద సంస్కృతి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
కార్యక్రమంలో ట్రస్ట్ ప్రముఖులు సాయినాధ శర్మ, బ్రహ్మానంద శర్మ, జగన్నాధం, వేంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ లక్ష్మయ్య, దేవాదాయ శాఖ మాజీ కమిషనర్ ముక్తేశ్వర్ రావుతో పాటు డా. సురపాణి, కుప్ప వాసుదేవ శర్మ, తదితరులు పాల్గొన్నారు.