కరీంనగర్ నెట్వర్క్/బొడ్రాయిబజార్/దిలావర్పూర్/మందమర్రి రూరల్/జైపూర్, మే 21: ఎన్నికల ముందర రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడంపై బీఆర్ఎస్ కన్నెర్ర జేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. అన్నదాతకు అండగా మరోసారి పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం పలు జిల్లాల్లోని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అన్ని మండలాల్లో రైతులతో కలిసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. సన్నవడ్లకే కాదు, అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వడంతోపాటు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. నాగారం మండల కేంద్రంలో సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, కరెంట్, కాళేశ్వరం నీళ్లు, పంట మొదట్లోనే రైతుబంధు ఇచ్చి ఆదుకున్నారని ఈ సందర్భంగా రైతులు గుర్తుచేసుకున్నారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు రైతులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికలకు ముందు రైతులు పండించిన ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన మాట అంతా బోగసేనని విమర్శించారు. ఇప్పటికైనా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని, లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఆదిల్పేట్లో, జైపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ మాట్లాడుతూ సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామనడం బాధాకరమని పేర్కొన్నారు.