హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయం ప్రకటించింది. గురువారం రాత్రి వరకు 99.46 శాతం ఫారాలను ఓటర్లకు అందించినట్టు వెల్లడించింది. ఈమేరకు రాష్ట్రంలో సాగుతున్న ‘సర్ ప్రక్రియకు సంబంధించిన తాజా గణాంకాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్లు) పంపిణీ దాదాపు పూర్తికావచ్చింది.
వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను తొమ్మిది జిల్లాల్లో ఈఎఫ్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నల్లగొండ, జనగామ జిల్లాలు వందకు వంద శాతం పంపిణీని పూర్తిచేసి ముందంజలో నిలిచాయి.
అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 97.51 శాతం పంపిణీ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొ త్తం 3,38,26,448 ఓటర్లకుగాను 3,36,43,649 మందికి (99.46 శా తం) ఈఎఫ్ ఫారాలను పంపిణీ చేసిన ట్టు సీఈవో కార్యాలయం స్పష్టంచేసిం ది. ఫారాల పంపిణీ వేగంగా సాగినప్పటికీ, వాటిని కంప్యూటరీకరించే ప్రక్రి య మందకొడిగా నడుస్తున్నది. రాష్ట్ర సగటు డిజిటలైజేషన్ కేవలం 20.55 శాతంగానే నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా 57.64 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నది. ఆ తర్వాత కుమ్రం భీం ఆసిఫాబాద్ (48.48 శాతం), నల్లగొండ (46.82 శాతం) జిల్లాలు ఉన్నాయి.
అత్యధిక ఓటర్లు ఉన్న మేడ్చల్మలాజిగిరి జిల్లా కేవలం 2.44 శాతం డిజిటలైజేషన్తో అన్నిటికంటే వెనుకబడి ఉన్నది. హైదరాబాద్ జిల్లాలో 5.77 శాతం, రంగారెడ్డి జిల్లాలో 8.85 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సేకరించిన ఫారాలలో కేవలం 69,51,402 ఫారాలను మాత్రమే అధికారులు డిజిటలైజ్ చేయగలిగారు. ఈ నెల 24న ఫారాల సమర్పణకు తుదిగడువు కావడంతో రానున్న రోజుల్లో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సి ఉన్నది.