హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అక్కసుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరుండటంపై ప్రభుత్వ అభ్యంతరాలపై ఆయన ధ్వజమెత్తారు. విద్యాశాఖపై రేవంత్‌రెడ్డి కనీసం సమీక్షే నిర్వహించలేకపోయారని తెలిపారు.
పాఠ్య పుస్తకాల ముద్రణ సమయంలోనే ముందుగా ఎందుకు దీనిపై సమీక్షించలేదని ప్రశ్నించారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఫొటోలున్న స్కూల్ బ్యాగ్‌లను విద్యార్థులకు అందజేయాలని ఆ రాష్ట్ర సీఎం నిర్ణ యం తీసుకున్నారని, తెలంగాణలో అం దుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో తన పేరు లేదనే దురుద్దేశంతో కోట్లాది రూపాయల భారం పడేలా చూస్తున్నారని విమర్శించారు. ప్రజాధనం దుర్వినియోగం చేయద్దని సీఎంకు హితవు పలికారు. పుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే ఏమైతదని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు తుంగ బాలు పాల్గొన్నారు.