భారతీయ సినిమా లివింగ్ లెజెండ్స్ కమల్‌హాసన్, రజనీకాంత్ 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలిసి నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సినిమా అప్డేట్స్ కోసం యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శనివారం ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది. రెడ్ జాయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి ‘కెహెచ్ & ఆర్కే’ అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. 70వ దశకంలో రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి నటించారు. అనంతరకాలంలో వారిద్దరూ భారతీయ సినిమాలో తిరుగులేని స్టార్డమ్తో లెజెండ్స్‌గా ఎదిగారు.
ఈ సందర్భంగా రెడ్ జాయింట్ మూవీస్ ప్రతినిధి మాట్లాడుతూ ‘ఇదొక చారిత్రక ఘట్టం. ఇద్దరు దిగ్గజ నటులతో సినిమా చేయటం గొప్ప బాధ్యతగా భావిస్తున్నాం. మా కల నిజమైన అనుభూతి కలుగుతున్నది. భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం’ అన్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్నందిస్తున్నారు.