Narayanpet : నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస మరణాలపై తక్షణ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల కాలంలో నమోదవుతున్న మరణాలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసేందుకు హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వైద్యుల బృందం నారాయణపేటకు వచ్చింది.
విచారణ బృందంలో డాక్టర్ బాబురావు(పీడియాట్రిక్ సర్జన్), డాక్టర్ కవిత (పీడియాట్రిక్ ప్రొఫెసర్)లు ఉన్నారు. వీరిద్దరూ నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణులు. నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. సంపత్ కుమార్ సింగ్ (చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు) సమక్షంలో హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి చెందిన ప్రత్యేక వైద్యుల బృందం విచారణ చేపట్టింది.
ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, చికిత్సకు సంబంధించిన వివరాలు ఆరా తీసింది. మృతి ఘటనలకు దారితీసిన పరిస్థితులను ప్రత్యేక వైద్యుల బృందం సమగ్రంగా పరిశీలించింది. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రత్యేక వైద్యుల బృందం సమర్పించే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.