చీకటి పడింది. అందరూ పడుకున్నారు. కానీ, బెడ్ పక్కన చిన్న వెలుతురు.ఏదో మ్యూజిక్.. అడపా దడపా వినిపించే నవ్వులు. దాన్నే ‘డూమ్ స్క్రోలింగ్’ అంటాం. ‘ఇంకొక్క రీల్ అంతే.. ఆ తర్వాత పక్కా నిద్రపోతా’ అనుకుంటూ ఫోన్ అన్ లాక్ చేయడం. అలా స్క్రోల్ చేస్తూ గడిపేయడం. అలా కళ్లు స్ట్రెయిన్ అయ్యేసరికి తెల్లారుతుంది. ఈ అనారోగ్యకరమైన అలవాటుకు ఇప్పుడు ‘డిజిటల్ సన్‌సెట్’ అనే మందు కావాలి. రియల్ లైఫ్‌లో సన్ సెట్ అవ్వగానే వర్చువల్ లైఫ్‌లోనూ దాన్ని అమలుచేయాలి. ఇది మన కంటికి, మెదడుకు ఎంత అవసరమో కచ్చితంగాతెలుసుకోవాలి. సూర్యుడు అస్తమించినట్లే, మనం పడుకోవడానికి కనీసం ఒక గంట ముందే మన ఇంట్లోని డిజిటల్ తెరలన్నీ (ఫోన్, ట్యాబ్, టీవీ, ల్యాప్‌టాప్) ఆగిపోవడాన్నే ‘డిజిటల్ సన్‌సెట్’ అంటారు. దీన్ని కచ్చితంగా ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
చీకటి పడగానే మన మెదడు ‘మెలటోనిన్’ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మనల్ని నిద్రకు సిద్ధం చేస్తుంది. కానీ, ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ చూసి పగలు అనుకుని ఆ హార్మోన్‌ను ఆపేస్తుంది. దాని ఫలితమే నిద్రలేమి. చాలామంది తెలివిగా బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్ పెట్టుకుని ఫోన్ వాడుతుంటారు. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఆ ఫోన్లోని కంటెంట్, నోటిఫికేషన్లు మీ మెదడును నిరంతరం స్టిమ్యులేట్ చేస్తూనే ఉంటాయి. ఫిల్టర్లు ఉన్నా ఫోన్ పక్కన పెట్టకపోతే లాభం లేనట్లే.
రాత్రి పూట ఫోన్ చూడటం ఓ ఎమోషనల్ డిస్ట్రాక్షన్ లాంటిది. ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ స్క్రీన్ మనకు తోడులా అనిపిస్తుంది. అందుకే ఆ ఫోన్‌ని పక్కన పెట్టడం కష్టమవుతుంది. ఇది కేవలం కుర్రాళ్ల సమస్య మాత్రమే కాదు. అరవై ఏళ్ల వృద్ధులు సైతం ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఫోన్ చూస్తూ నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు పెద్ద వాగ్దానాలు తీసుకుంటే సాధ్యం కాదు. అలారం కోసం ఫోన్‌ని బెడ్ పక్కన పెట్టుకోవడం మానేసి పాత కాలపు అలారం క్లాక్ వాడండి. పడుకునే ముందు ఫోన్ చూడటం బదులు పుస్తకం చదవండి లేదా కాసేపు మెడిటేషన్ చేయండి. మన మెదడు డిజిటల్ వెలుతురు కోసం కాదు, బయట కనిపించే అసలైన సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేయడానికి పుట్టింది. ఆ ‘చివరి రీల్’ మీ జీవితాన్ని మార్చేయదు కానీ, ఆ గంట నిద్ర మాత్రం మీ మరుసటి రోజును అద్భుతంగా మార్చేస్తుంది. డిజిటల్ సన్‌సెట్ అనేది ఒక కఠినమైన రూల్ కాదు. అది మీ ఆరోగ్యం కోసం మీరు చేసుకునే ఒక ఒప్పందం.