Teachers transfers | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సెప్టెంబర్‌లో చేపట్టాలని విద్యాశాఖ యోచిస్తున్నది. అదే నెలలో ఈ ప్రక్రియనంతా పూర్తిచేయాలని భావిస్తున్నది. బుధవారం టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు టీచర్ల బదిలీలు, పదోన్నతుల అంశంపై సమీక్షించారు. తాజా సమాచారం ప్రకారం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పాత పద్ధతిలోనే జరుగనున్నది. కానీ, షెడ్యూల్లో తేదీలు మాత్రం మారుతాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి, విద్యాశాఖ టీచర్ల బదిలీల షెడ్యూల్‌ను జనవరిలో విడుదల చేసింది. ఫిబ్రవరిలోనే బదిలీలు చేపట్టాల్సి ఉన్నది. 59 వేల మందికిపైగా టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఈ దశలో హైకోర్టు స్టే జారీచేయడంతో బదిలీలు నిలిచిపోయాయి. తాజాగా స్టే ఎత్తివేయడంతో బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపినట్టయింది. గతంలో బదిలీలకు కటాఫ్ తేదీని ఫిబ్రవరి 1గా ఖరారు చేశారు. తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 1గా నిర్ణయించారు. దీంతో జూలై 2015 తర్వాత వారు కూడా తప్పనిసరిగా బదిలీ అవుతారు.
బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే ఎత్తివేయడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎంతో కాలంగా బదిలీల కోసం వేచిచూస్తున్న వారికి ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనున్నదని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు అభిప్రాయపడ్డారు. బదిలీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వారు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో మాట్లాడారు. మొత్తం మీద బదిలీల కేసు కొలిక్కి రావడం శుభశూచకమని పేర్కొన్నారు. అతి త్వరలోనే షెడ్యూల్ విడుదలవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కృషిచేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డికి, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావుకు, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరణకు, డైరెక్టర్ శ్రీదేవసేనకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానోపాధ్యాయుల బదిలీలు, టీచర్ల పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ రాజభాను చంద్రప్రకాశ్, ప్రధానకార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డిలు కోరారు. హైకోర్టు తీర్పును టీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్, ప్రధానకార్యదర్శి కటకం రమేశ్ స్వాగతించారు.
ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభసూచకం. ఎంతో కాలంగా బదిలీల కోసం వేచిచూస్తున్న టీచర్ల ఆశ త్వరలో నెరవేరబోతున్నది. జనవరిలో జరగాల్సిన బదిలీలు పలు కారణాలతో వాయిదాపడ్డాయి. మొత్తం మీద కోర్టు తీర్పుతో టీచర్లంతా హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సభ్యసంఘాలకు 10 పాయింట్లను కేటాయించాలి.
-సదానంద్‌గౌడ్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
టీచర్లంతా తొమ్మిదేండ్లుగా బదిలీల కోసం వేచిచూస్తున్నారు. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు కొన్ని సవరణలతో బదిలీలకు మార్గం సుగమం చేయడం సంతోషదాయకం. ఈ నేపథ్యంలో విద్యాశాఖ తక్షణమే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలి. బదిలీలకు కటాఫ్ తేదీగా సెప్టెంబర్ 1ని పరిగణనలోకి తీసుకోవాలి.
– ఎం చెన్నయ్య, పీఆర్టీయూ తెలంగాణ