హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): పిల్లలు బడికి రావాలి. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి. కానీ పిల్లలు బడికొస్తున్నా పాఠాలు చెప్పేందుకు సమయం ఉండటమే లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. విలువైన ఆ బోధనా సమయాన్ని విద్యాశాఖ, జిల్లా యంత్రాంగం మింగేస్తున్నదని మండిపడుతున్నారు. రికార్డులు, నివేదికలు ఇచ్చేందుకే సగం సమయం పోతున్నదని, ఇక పాఠాలు చెప్పేదెప్పుడని వారంతా నిట్టూరుస్తున్నారు. అసలు బోధన నుంచి పక్కకు తప్పించారని, క్లరికల్ పనులకు వాడుతున్నారని వాపోతున్నారు.
బడి మొదలైంది మొదలు.. ఫేషియల్ అటెండెన్స్, మధ్యాహ్న భోజనం, ఎఫ్ఎల్ఎన్, ఎఫ్ఏ మార్కుల అప్లోడింగ్, పుస్తకాలు, నోటుబుక్స్, వర్క్‌బుక్స్, మొక్కలు నాటే పనులు నిత్యకృత్యమయ్యాయి. ఇవేకాకుండా యూడైస్‌లో వంద వివరాలు, జూమ్ మీటింగ్స్, కాంప్లెక్స్ సమావేశాలు అంటూ కాలమే కరిగిపోతున్నది. ఈ దశలో పాఠాలు చెప్పేదెప్పుడని టీచర్లే ప్రశ్నిస్తున్నారు. కొందరు అధికారులు తమ పైస్థాయి అధికారుల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, కొందరు కలెక్టర్లు శృతి మించుతున్నారన్న ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను ఎమ్మార్సీ, కాంప్లెక్స్ స్కూళ్లల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా వాడుతున్నారు. నిజానికి సమాచార సేకరణకు, మానిటరింగ్‌కు వారిని వినియోగించుకోవాలి. ఎవరైనా టీచర్ సెలవు పెడితే సీఆర్పీలను ఆ బడికి పంపించాలి. కానీ వీరిని ఆపరేటర్లుగా మార్చేశారని టీచర్లు అంటున్నారు. ‘ఇప్పటికైనా పెద్ద సార్లు మారాలి. బోధనకు అడ్డుగా మారిన కాగితాలు, ఆన్లైన్ రిపోర్టుల నుంచి మాకు విముక్తి ఇవ్వాలి. పార్మాట్లు ఇవ్వకుండా పాఠాలు చెప్పే వీలు కల్పించండి’ అంటూ పలువురు ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు.