హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఇద్దరు ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం సంచలనం రేపింది. హైదరాబాద్ సైఫాబాద్‌లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ సూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్ ఎస్ ఫణిరాజ్, రంగారెడ్డి డీఈవో కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డారు.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓ సీబీఎస్ఈ పాఠశాలకు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేసేందుకు వారు రూ.70 వేలను డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించి వారిని పట్టుకున్నారు. ఆ ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.