ఖమ్మం కమాన్‌బజార్, జూలై 29: ఖమ్మం ప్రకాశ్‌నగర్ వద్ద మున్నేరుపై కూల్చివేసిన చెక్‌డ్యాంను పునర్నిర్మించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తద్వారా.. ఖమ్మం నగర ప్రజల దాహార్తిని తీర్చాలని, పరీవాహకంలో భూగర్భ జలాల పెంపునకు ఊతమివ్వాలని డిమాండ్ చేశారు. బహుళ ప్రయోజనాల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఖమ్మం మున్నేటిపై ప్రకాశ్‌నగర్ వద్ద రూ.7.45 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాంను కాంగ్రెస్ పాలకులు ఇటీవల కక్షపూరితంగా కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహించారు. డ్యాం కూల్చివేతతో ఖమ్మం నగర ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తడం, మున్నేరు పరీవాహకంలో భూగర్భ జలాలు అడుగంటడం, ఫలితంగా ఆ ప్రాంతంలో సాగునీటికీ ఇబ్బందులు ఏర్పడడం వంటి కారణాల నేపథ్యంలో ఖమ్మం మున్నేటిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిన చెక్‌డ్యాం వద్ద బీఆర్ఎస్ నేతలు బుధవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం, పరిసర ప్రాంతాల ప్రజల తాగు, సాగునీటి అవసరాల కోసం గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవతో ఖమ్మం మున్నేటిపై చెక్‌డ్యాంను నిర్మించినట్లు గుర్తు చేశారు. అయితే, తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదిరిగానే ఖమ్మానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నిర్మించిన అభివృద్ధి పనుల ఆనవాళ్లను లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే తుమ్మల ఆదేశాలతో కాంగ్రెస్ నేతలు వెళ్లి రాత్రికి రాత్రే ప్రకాశ్‌నగర్ చెక్‌డ్యాంను కూల్చివేశారని ఆరోపించారు.
ప్రజా ప్రయోజనాల కోసం అప్పటి ఇరిగేషన్, ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేసి డీపీఆర్ రూపొందించిన తరువాతే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ చెక్‌డ్యాం నిర్మించినట్లు నేతలు గుర్తుచేశారు. సుమారు 200 మీటర్ల వెడల్పుతో 3 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ డ్యాంను 2023లో వచ్చిన వరద ముప్పు పేరుతో కుట్రలు చేసి ఆగమేఘాల మీద రాత్రికిరాత్రే కూల్చివేశారని మండిపడ్డారు. అప్పటి కలెక్టర్ మెడపై కత్తి పెట్టి తప్పుడు నివేదికలు తయారు చేయించి ఈ డ్యాంను కూల్చివేశారని ఆరోపించారు. త్రీటౌన్‌లో సుమారు 50 ఏళ్ల కిందట నిర్మించిన చెక్‌డ్యాంను సైతం తొలగించారన్నారు. తుమ్మల బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇదే మున్నేరుపై ఐదు చెక్‌డ్యాంలు నిర్మించారని గుర్తుచేశారు. ‘అయితే, వాటికి రాని వరద ముప్పు ఈ ఒక చెక్‌డ్యాంకు మాత్రమే వచ్చిందా?’ అని ప్రశ్నించారు.
మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్‌ను మంజూరు చేయించింది, నిధులు తెచ్చింది అప్పటి మంత్రి అజయ్‌కుమార్ అని గుర్తు చేశారు. కానీ, మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ కాంగ్రెస్ మంతులు దాన్ని పూర్తిచేయలేకపోతున్నారని విమర్శించారు. తీగల వంతెన నిర్మాణాన్ని కూడా అలాగే ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఖమర్, బత్తుల మురళి, మక్బూల్, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, కూరాకుల వలరాజు, రోజ్లీనా, రాజేశ్, పాలడుగు పాపారావు, మెంతుల శ్రీశైలం, ఎర్రా అప్పారావు, బోజడ్ల రామ్మోహన్, కొప్పెర నరసింహారావు, దడాల రఘు, సుగుణారావు, తాజుద్దీన్, మిట్టపల్లి రవి, షేక్ మస్తాన్, మాటేటి కిరణ్, మాటూరి లక్ష్మీనారాయణ, ఖయ్యూం, షకీనా, నన్నే, చిన్నం మలేశ్ తదితరులు పాల్గొన్నారు.