దుబ్బాక, జూలై 29: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, వివిధశాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు దుబ్బాక నియోజకవర్గంపై చిన్న చూపుచూస్తున్నారని మండిపడ్డారు. వైఖరి మార్చుకోకపోతే కలెక్టరేట్ ముట్టడికైనా వెనుకాడమని హెచ్చరించారు. దుబ్బాక ప్రజలకు ఉద్యమాలు, పోరాటాలు కొత్త కాదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాల్సిన జిల్లా అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు.
సర్పంచ్‌లు , మండల స్థాయి అధికారులు సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులతో పాటు మండలస్థాయి అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు.దుబ్బాక మండలంలో నెలకొన్న సమస్యలపై ఆయాశాఖల అధికారులతో సమీక్షించారు. యాప్ ద్వారా యూరియా కొనుగోలు సమస్యగా మారిందన్నారు. వరిలో సన్నరకం, మొక్కజొన్న, ఆరుతడి పంటలతోపాటు ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు.
గ్రామాల్లో బోరు బావుల నుంచి ఓహెచ్‌ఆర్ ట్యాంకుల ద్వారా నల్లానీరు సరఫరా చేయడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే సమస్యలు ఉండవన్నారు. రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దుబ్బాక నియోజకవర్గంలో అధికారులు, సర్పంచ్‌లతో సమీ క్షా సమావేశాలు నిర్వహించిన ఘనత ఎమ్మెల్యేకే దక్కిందన్నారు. సమావేశంలో సిద్దిపేట జిల్లా డీఆర్డీవో పీడీ జయదేవ్‌ఆర్యా, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, తహసీల్దార్ మోతిసింగ్, ఎంఈవో ప్రభుదాస్. విద్యుత్ డీఈ గంగాధర్, పీఆర్డీఈ విజయ్ , దుబ్బాక సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు దేవరాజ్ పాల్గొన్నారు.