కరీంనగర్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రాజన్న సిరిసిల్ల (నమస్తే తెలంగాణ) : నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. మొదటినుంచీ ఆర్డర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కో ఆర్డర్‌ను రద్దు చేస్తూ తెలంగాణ చేనేత సహకార సంఘం(టెస్కో) నిర్వీర్యానికి కుట్రలు చేస్తున్నది. ఈ సంఘం ద్వారా నేతన్నలకు దక్కాల్సిన రూ.60 కోట్ల టెండర్లను ఇటీవలే ప్రైవేట్‌కు అప్పగించి పొట్టకొట్టిన సర్కార్.. స్కూల్ యూనిఫామ్‌లకు సంబంధించి రూ.105 కోట్ల ఆర్డర్లను రద్దు చేస్తూ చేనేత జౌళి శాఖకు విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. వెంటనే వస్ర్తోత్పత్తి నిలిపివేయాలని టెస్కో చేనేత, మ్యాక్స్ సంఘాలకు ఆదేశాలిచ్చింది. ఈ పరిణామంతో ఇవాళ వేలాది మంది నేతన్నలు ఉపాధి కరువై రోడ్డున పడాల్సిన దుస్థితి దాపురించింది. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా టెస్కోకు వచ్చే రూ.590 కోట్ల విలువైన వస్ర్తోత్పత్తికి మంగళం పాడి ఆ మొత్తాన్ని ప్రైవేట్‌కు కట్టబెట్టనున్నట్టు తెలుస్తున్నది. నేతన్నల ఉపాధికి గండిపెట్టేలా సర్కార్ వ్యవహరిస్తుండటంపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
సమైక్యపాలనలో ఆకలిచావులు, ఆత్మహత్యలే శరణ్యం అనుకొని కుటుంబాలను వెల్లదీసిన నేతన్నల బతుకులను బాగు చేసేందుకు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే వృత్తిని నమ్ముకున్న వారికి చేతినిండా పని కల్పించే లక్ష్యంతో ముందుగా బతుకమ్మ చీరల పనులను అప్పగించారు. ఆ తర్వాత ప్రభుత్వ, విద్యాశాఖ, సంక్షేమ శాఖల పరిధిలోని విద్యార్థులకు దుస్తులు దుప్పట్ల పంపిణీతోపాటు పండుగలకు ఉపయోగ పడే వస్ర్తాన్ని కూడా వారికే అప్పగించేందుకు చర్యలు తీసుకున్నారు. డిమాండ్‌ను బట్టి టెస్కోకు ఆర్డర్లు ఇచ్చి, అక్కడినుంచి చేనేత, మ్యాక్స్ సంఘాలకు ఆర్డర్లు ఇచ్చారు. సదరు సంఘాలు వారి పరిధిలోని పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించి వస్ర్తోత్పత్తి చేసే వారు. ప్రతి వారం సదరు సంఘాల వారికి కూలీ చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా పని ఉండడంతోపాటు ప్రతి వారం వచ్చే కూలీ రేట్ల ద్వారా ఒక్కో కార్మికుడు నెలకు రూ.15వేలకు పైగా సంపాదించే అవకాశం కల్పించారు. ఫలితంగా ఒకనాడు మరణ మృందంగాన్ని తపించిన సిరిసిల్ల బీఆర్ఎస్ హయాంలో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నది.
నాటి బీఆర్ఎస్ చర్యలతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండుతున్న విషయం కాంగ్రెస్ సర్కార్‌కు మొదటినుంచీ మింగుడు పడలేదు. వచ్చీ రాగానే.. ఆర్డర్లు ఇచ్చేందుకు ముప్పుతిప్పులు పెట్టింది. విసిగివేసారిన నేతన్నలు ఏకంగా ఆందోళనలకు సిద్ధమవడంతో దిగొచ్చిన ప్రభుత్వం, అత్తెసరు టెండర్లు ఇస్తూ వచ్చింది. మళ్లీ ఇప్పుడు కుట్రలకు తెరలేపుతున్నది. రంజాన్ తోఫా సందర్భంగా రూ.60 కోట్ల విలువైన వస్ర్తోత్పత్తిని చేనేత, మ్యాక్స్ సంఘాలకు ఇవ్వకుండా మైనారిటీ శాఖ ద్వారా ప్రైవేట్ టెండర్లు పిలిచి ఇతరులకు కట్టబెట్టింది. ఈ విషయం మరచిపోకముందే నేతన్నలకు మరోసారి దగా చేసే నిర్ణయం తీసుకున్నది. 2026-27 సంవత్సరానికి స్కూల్ యూనిఫారాలకు సంబంధించి విద్యాశాఖ ఎప్పటి మాదిరిగానే రూ.105.54 కోట్ల విలువవైన వస్ర్తోత్పత్తిని ఆర్డర్లను టెస్కోకు ఇచ్చింది. ఆ మేరకు టెస్కో.. సదరు ఆర్డర్లను చేనేత, మ్యాక్స్ సంఘాలకు ఇచ్చింది. సదరు సంఘాలు ఇప్పటికే ముడిసరుకు తెచ్చి దాదాపు 70శాతం వరకు ఉత్పత్తి పూర్తి చేశారు. తీరా సరఫరా చేసే సమయంలో ఏకంగా ఆర్డర్లనే రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ, చేనేత జౌళి శాఖకు ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన క్లాత్‌ను ఎవరు తీసుకుంటారు? ఆర్డర్లు అర్ధాంతరంగా ఎందుకు రద్దు చేశారు? ఉత్పత్తి చేసిన చేనేత, మ్యాక్స్ సంఘాల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలకు ఏ అధికారి వద్ద కూడా సమాధానం లేదు. దీంతో సంఘాలు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది.
చేనేత, మ్యాక్స్ సంఘాలు నేటి నుంచి వస్ర్తోత్పత్తి నిలివేయనున్నాయి. నేతన్నలకు ఉపాధి దూరం కానున్నది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నా 90శాతం భారం సిరిసిల్ల నేతన్నలపై పడనున్నది. సిరిసిల్లలో 134 మ్యాక్స్ సంఘాలుండగా అందులో 127సంఘాలకు 20 లక్షల మీటర్ల క్లాత్ తయారీకి ఆర్డర్లు ఇచ్చారు. టెక్స్టైల్ పార్క్ పరిధిలో పనిచేస్తున్న 29 యూనిట్లకు 43లక్షల మీటర్లు ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్ ఇచ్చారు. ఒక్క సిరిసిల్లలోనే 63లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి ఆర్డర్లు రద్దు చేయడం వల్ల 6వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, మళ్లీ ఆకలిచావులు, ఆత్మహత్యలే శరణ్యమని నేతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, వసతి గురుకులాలకు యానిఫామ్లు, దుప్పట్ల తయారీ, అలాగే వివిధ పండుగలకు ఆర్డర్లను ప్రభుత్వం టెస్కో ద్వారా ఇస్తూ వస్తున్నది. ఏటా అన్ని శాఖల ద్వారా వచ్చే రూ.590 కోట్ల విలువైన ఆర్డర్లను 334 చేనేత సహకార సంఘాలు, 180కి పైగా ఉన్న మ్యాక్స్ సంఘాలకు టెస్కో ఆర్డర్లు ఇచ్చి ఉత్పత్తి చేయిస్తున్నది. ఈ విధానం వల్ల 69వేల మంది ఉపాధి పొందేవారు. కానీ, ప్రభుత్వం మాత్రం కమీషన్లు దండుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టెస్కో ద్వారా యథావిధిగా ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి వస్త్ర పరిశ్రమను కాపాడాలని సిరిసిల్లలోని పవర్‌లూం మ్యాక్స్ సొసైటీ, పాలిస్టర్ అసోసియేషన్ సభ్యులు గురువారం చేనేత జౌళి శాఖ ఏడీ సంతోష్‌కుమార్‌ను కోరారు. వస్ర్తోత్పత్తి జరుగుతుండగా ఆర్డర్లు రద్దు చేయడం అన్యాయమని, తాము తీవ్రంగా నష్టపోతామని, కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడుతారని ఆవేదన చెందారు. ఆర్డర్ల రద్దు అంశాన్ని సీఎస్ దృషికి తీసుకెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు వారు చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మంచె శ్రీనివాస్, దూడం శంకర్, మండల సత్యం, తాటిపాముల దామోదర్, ఆడెపు భాస్కర్, గోవిందు రవి, బొద్దుల సుదర్శన్, ఏనుగుల ఎల్లయ్య, గడ్డం ప్రసాద్ ఉన్నారు.
ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేది మరొకటి. కమీషన్ల కోసమే టెస్కోకు ఆర్డర్లు ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది కార్మికుల ఉపాధిపై దెబ్బకొడుతున్నారు. చేతినిండా పనిలేక మళ్లీ సంక్షోభంలో కూరుకుపోతారు. ఇప్పటికైనా జీవో ప్రకారం పని కల్పించాలి. టెండర్ల విధానానికి స్వస్తి పలుకాలి. లేకపోతే ఆందోళనలు చేస్తాం.
స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లను యుద్ధప్రాతిపాదికన ఉత్పత్తి చేశాం. వస్త్ర ఉత్పత్తి పూర్తి చేశాక హఠాత్తుగా ఆర్డర్లను రద్దు చేయడం అన్యాయం. ఇప్పటికే యారన్కు రూ.10 కోట్లు, కార్మికులకు కూలీ కోసం రూ.3 కోట్ల వరకు ఖర్చుచేశాం. తయారైన బట్టలను ఏం చేయాలి?. ప్రభుత్వ నిర్ణయం వస్త్ర పరిశ్రమ మళ్లీ సంక్షోభంలో పడుతుంది. పునరాలోచించి మాకు న్యాయం చేయాలి.