హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టిపెట్టింది. రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ ఇప్పటికే దీనిపై దర్యాప్తు చేస్తుండగా, ఈడీ అధికారులు కూడా ఆరా తీస్తుండటం గమనార్హం. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని లేఖలో పేరొన్నారు.
జిల్లాలవారీగా లబ్ధిదారులు, వారి ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ నంబర్లు సహా పూర్తి వివరాలు కావాలని అడిగారు. గొర్రెలను ఎక్కడి నుంచి కొని తీసుకొచ్చారు? అమ్మినవారి సమగ్ర వివరాలు, గొర్రెలను ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తరలించారు.. తరలించడానికి ఉపయోగించిన ట్రాన్స్‌పోర్టు వాహనాలు, వాటి యజమానుల వివరాలు కూడా కావాలని లేఖలో పేర్కొన్నారు. ఈ పథకంపై ఏసీబీ దర్యాప్తు, మీడియా కథనాలను ఈడీ గమనిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే కొంత సమాచారాన్ని ఏసీబీ అధికారవర్గాల నుంచి తీసుకున్నట్టు సమాచారం. ఈ పథకంపై ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
గొర్రెల పంపిణీలో సుమారుగా రూ.700 కోట్ల వరకు అక్రమాలు జరిగి ఉండొచ్చని తెలంగాణ అవినీతి నిరోధకశాఖ తొలుత పత్రికలకు లీకులు ఇచ్చింది. ఈ అక్రమాలకు ఆద్యులెవరు? ఇందులో ఎవరెవరి పాత్ర ఉన్నది? అనే దానిపై ఎక్కడా సరైన ఆధారాలు చూపలేకపోతున్నారు. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది, దళారులు కొంత వరకు చేతివాటం చూపించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. వీరు చేసిన మొత్తం అక్రమాల విలువ తొలుత చెప్పినట్టు రూ.700 కోట్లు ఏమీ ఉండదని దర్యాప్తులో ఉన్న అధికారులే చెప్తున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు మాజీ ఓఎస్డీ కల్యాణ్, పశుసంవర్ధకశాఖలో మాజీ అధికారి రాంచందర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. విచారణలో కొత్త విషయాలేమీ బయటికి రాలేదని, అధికారులు ఆశించిన సమాధానం రాలేదని తెలిసింది. దీంతో మళ్లీ వారిద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
గొర్రెల పంపిణీకి సంబంధించి ఈడీ అధికారులు కేసు నమోదు చేసినట్టు, దర్యాప్తు ప్రారంభించినట్టు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తొలుత చెప్పారు. ఆయన చెప్పిన కొద్దిసేపటికే ఈడీ అధికారులు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య అధికారులకు రాసిన లేఖ సోషల్ మీడియాలో కనిపించింది. ఈడీ అధికారులు ఈ కేసు గురించి బహిరంగంగా ఏమీ స్పందించలేదు. కానీ, బీజేపీ ఎంపీ ఇచ్చిన స్టేట్మెంటే మీడియాలో ప్రముఖంగా కనిపించింది. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈడీ ఆఫీసును బీజేపీ ఆఫీసులోనే పెట్టారంటూ దేశంలో తరచూ వినిపించే ఆరోపణ, విమర్శ నిజమే అన్నట్టుగా గురువారం బీజేపీ ఎంపీ మాట్లాడిన వెంటనే ఈడీ దర్యాప్తు సమాచారం మీడియాలో వచ్చింది. ఇది యాదృచ్చికమా? ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అంటూ పలువురు రాజకీయ నాయకులు చర్చించుకోవడం కనిపించింది.