పొద్దున లేస్తే నీతులు వల్లించే కాంగ్రెస్ సర్కార్‌లోని కీలక మంత్రి అడ్డంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి దొరికిపోయారు. గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాపార సామ్రాజ్యంపై వరుస ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడీ శుక్రవారం దాడులు జరిపింది. హైదరాబాద్‌లోని పొంగులేటి, ఆయన కుమారుడు హర్షారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈ దాడులు జరపడం సంచలనం సృష్టించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. శనివారం కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖుడిపై ఇటీవలికాలంలో ఈ స్థాయిలో దాడులు జరగడం ఇదే తొలిసారి. సోదాలకు సంబంధించి ఈడీ వర్గాల నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ.. పెద్దఎత్తున అక్రమాలను గుర్తించినట్టు ప్రాథమికంగా తెలిసింది. సోదాల సందర్భంగా మూడుసార్లు కరెన్సీ లెక్కింపు యంత్రాలను పొంగులేటి నివాసంలోకి ఈడీ సిబ్బంది తీసుకెళ్లడాన్ని బట్టి పెద్దఎత్తున కరెన్సీని కూడా కనుగొని ఉంటారని భావిస్తున్నారు. బోగస్ కంపెనీలతో విదేశాలకు హవాలా మార్గాల ద్వారా పెద్దఎత్తున నగదును తరలించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
టీడీఎస్ అక్రమాలు సహా పలు అంశాలపై ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. రూ.600 నుంచి 800 కోట్ల మేర అక్రమ లావాదేవీలను అధికారులు కనుగొన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.పొంగులేటి వ్యవహారాలకు సంబంధించిన కీలక పత్రాలు ఈ సోదాల్లో ఈడీకి హస్తగతమైనట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఇటీవల కాంగ్రెస్‌లో చేర్చుకోవడం వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ ఫిరాయింపుల వెనుక పెద్దఎత్తున కోట్లు చేతులు మారినట్టు విమర్శలు కూడా వచ్చాయి. ఈ పరిణామాలకు సంబంధించి కొన్ని ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు, వీటి ఆధారంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కూడా త్వరలోదృష్టి సారించనున్నట్టు చెప్తున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలోని హైకమాండ్‌కు రాష్ట్రం నుంచి అందిన భారీ మొత్తాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఈడీకి చేజిక్కినట్టు అనుమానిస్తున్నారు.
ED Raids | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి వర్గంలో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన రాఘవ ఇన్ఫ్రా, రాఘవ కన్స్ట్రక్షన్స్లతోపాటు పలు కంపెనీలపై అనేక ఆరోపణలున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఐటీ, కస్టమ్స్ వంటి దర్యాప్తు సంస్థలు గతంలో సోదాలు నిర్వహించగా తాజాగా ఈడీ రంగ ప్రవేశం చేయడం కలకలం రేపుతున్నది. ఈ దాడులకు సంబంధించి శుక్రవారం ఉదయాన్నే మంత్రి పొంగులేటికి సమాచారం అందిందని, ఆ మేరకు ఆయన తన కార్యాలయాలను అప్రమత్తం చేశారని ప్రచారం జరుగుతున్నది. శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం హిమాయత్‌సాగర్ బఫర్‌జోన్‌లోని తన ఇంట్లో ఉంటున్నారు. కొడుకు హర్షారెడ్డి, కోడలు కూడా అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. జూబ్లీహిల్స్‌లో పొంగులేటికి మరో ఇల్లు ఉన్నది. అక్కడ ఆయన కూతురు ఉంటున్నారు. ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్‌లోనూ ఆయనకు అధికారిక నివాసం ఉండగా, దానిని తన సంస్థల కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇక బంజారాహిల్స్‌లో రాఘవ ఇన్ఫ్రాకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నివాసం కేంద్రంగా పొంగులేటి కార్యక్షేత్రాలపై ఈడీ దాడులు జరిగాయి. ఈడీ బృందాల తనిఖీల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు ఆయన నివాసాలు, ఆఫీసులను ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఉదయం నుంచీ మినిస్టర్ క్వార్టర్స్‌లోనే దాడులకు కొద్దిసేపు ముందే సమాచారం అందుకున్న పొంగులేటి హడావిడిగా మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఆయన రోజంతా అక్కడే ఉన్నారు. ఈడీ దాడులకు సంబంధించి ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తన వ్యాపార సంస్థల ముఖ్యుల నుంచి విరాలు తెలుసుకుంటూ ఉన్నారని తెలిసింది. మరోవైపు ఈడీ సోదాల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శుక్రవారం బయట ఎక్కడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించలేదు. అధికారులతో సమీక్షతోపాటు పలు కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు పొంగులేటి వియ్యంకుడు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి దాడులు జరుగుతున్న సమయంలో జూబ్లీహిల్స్ నివాసానికి తరలివచ్చారు. అధికారుల అనుమతితో ఆయన ఫోన్లు తీసుకుని భద్రతాసిబ్బంది లోనికి అనుమతించారు. సుమారు గంటపాటు లోపల ఉన్న ఆయన తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు.
హర్షారెడ్డిని విచారించిన అధికారులు
ఈడీ దాడులు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. సుమారు 16 గంటలపాటు కొనసాగిన ఈ సోదాలపై ఉదయం నుంచీ ఉత్కంఠ నెలకొన్నది. జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి తనయుడు హర్షారెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. సోదాలు జరుగుతున్నంతసేపు ఆయనే అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం వేళ రాఘవ గ్రూప్‌కు సంబంధించిన ఆడిటర్‌ను పిలిపించిన ఈడీ అధికారులు.. ఆయనతోకలిపి హర్షారెడ్డిని విచారించారు. ఈ సందర్భంగా పలు కీలక లావాదేవీలు, అనుమానాస్పద కార్యకలాపాలు, అక్రమాస్తులపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. పొంగులేటి వివాదాలపైనా వారు ఆరా తీసినట్టు చర్చ జరుగుతున్నది.
పొంగులేటి వివాదాలపైనా ఆరా
మంత్రి పొంగులేటి నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఏ కేసు కేంద్రంగా వారు ప్రధానంగా విచారిస్తున్నారనే దానిపై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. ఎఫ్ఐయూ జోక్యం చేసుకోవడంతో ఈ కేసు వందల కోట్ల విలువైన లావాదేవీలతో ముడిపడి ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో పొంగులేటి ఆర్థిక వ్యవహారాలను కమ్ముకున్న పలు అభియోగాలను వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
తెరపైకి యూరో బ్యాంక్ గ్యారెంటీలు!
పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,495 కోట్ల కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్నది. ఈ క్రమంలో వెస్టిండీస్‌లోని ఎగ్జిమ్‌బ్యాంకు నుంచి ఏపీ ప్రభుత్వానికి రూ. 80 కోట్ల విలువైన గ్యారెంటీలు సమర్పించింది. అయితే, ఆ గ్యారెంటీలపై ఏపీ సర్కారు అనుమానాలు వ్యక్తం చేయడం, దేశీయ బ్యాంకింగ్ సంస్థలను కాదని ఎక్కడో కరేబియన్ దీవుల్లోని ఎగ్జిమ్‌బ్యాంకు నుంచి పొంగులేటి గ్యారెంటీలు సమర్పించడం అనుమానాలకు తావిచ్చింది.
కొడుకు మెడకు లగ్జరీ వాచీల కేసు
హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా చెన్నైకి అక్రమంగా తరలిన పాటెక్ ఫిలిప్ 5740, రెండోది బ్రెగ్యుట్ 2759 వంటి ఖరీదైన చేతిగడియారాల కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చారు. మద్రాస్ హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నది. పట్టుబడిన వాచీల విలువ రూ. 8 కోట్ల వరకు ఉన్నప్పటికీ, అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన మధ్యవర్తి నవీన్ కుమార్ రూ. 100 కోట్లకు పైగా స్మగ్లింగ్ చేసినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. క్రిప్టో, హవాలా ద్వారా పెద్దయెత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్టు పేర్కొన్నారు.
650 కోట్ల టీడీఎస్ ఎగవేత ఆరోపణలు
రూ.650 కోట్ల విలువైన టీడీఎస్‌ను ఎగ్గొట్టేందుకు రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్వాహకులు మూడు బోగస్ కంపెనీలను సృష్టించారని వార్తలు వచ్చాయి. కాగితాలకు మాత్రమే ఈ కంపెనీలు పరిమితమయ్యాయా? నిజంగానే ఉన్నాయా? ఒకవేళ ఉంటే ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాయి? అనే వివరాలకు సంబంధించి డైరెక్టరేట్ ఆప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆరునెలల కిందటే రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను నమోదు చేశారు. ఇప్పుడు ఆ విషయమై సోదాలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
తెరపైకి అక్రమాస్తులు!
మంత్రి పొంగులేటి కుమారుడు పొంగులేటి హర్షారెడ్డికి రూ.1,300 కోట్ల పైచిలుకు ఆస్తులున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ మేరకు ఆస్తులు ఉన్నైట్లెతే, వాటికి సంబంధించిన ఆదాయపు పన్ను చెల్లింపులు సరిగ్గా జరుగుతున్నాయా? ఆస్తులకు సంబంధించిన పత్రాలు అన్నీ సరిగ్గా ఉన్నాయా? అనే కోణంలో ఈ సోదాలు జరుగొచ్చని అంచనా వేస్తున్నారు.
రెండు కంపెనీల బంధం
శుక్రవారం నాటి సోదాలకు కేంద్ర బిందువుగా మారిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీతో కోట్లల్లో లావాదేవీలు జరిగినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ రెండు కంపెనీల టర్నోవర్, డైరెక్టర్లు ఇతరత్రా వివరాలపైనా ఈడీ దృష్టిసారించినట్టు చెప్తున్నారు.
వివాదాల ఎగ్జిమ్ బ్యాంక్
వెస్టిండీస్‌లోని సెయింట్ లూసియాలో కేంద్రంగా ఉన్న యూరో ఎగ్జిమ్ బ్యాంక్‌పై అనేక ఆరోపణలున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఓ సంస్థ డిఫెన్స్ పనుల కాంట్రాక్టును సాధించింది. పనులు చేపట్టే ముందు ఈ బ్యాంకు నుంచే గ్యారెంటీలు సమర్పించింది. వాటిని ఆధారంగా చేసుకొని అధికారులు పనులు అప్పగించారు. చివరకు ఆ సంస్థ బిచాణా ఎత్తేసింది. పనులను పూర్తిచేయలేదు. దీంతో అధికారులు నష్టపరిహారం కోసం బ్యాంక్ గ్యారెంటీలను స్వాధీనం చేసుకుందామనుకుంటే వాళ్లు సమర్పించిన గ్యారెంటీలు చెల్లలేదు. అంటే ఆ బ్యాంక్ బోగస్ అని అర్థమవుతున్నది. కాగా, వివిధ సంస్థలకు వేల కోట్ల గ్యారెంటీలను ఇస్తున్న ఎగ్జిమ్ బ్యాంక్ వాస్తవ విలువ రూ. 8 కోట్లు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 650కి పైగా శాఖలున్నట్టు ఈ బ్యాంకు చెప్తున్నప్పటికీ, అదంతా అబద్ధం. మన దేశంలో ఒక్క శాఖ కూడా లేని ఇలాంటి బ్యాంకు.. పొంగులేటి కంపెనీకి గ్యారెంటీలు సమర్పించడం ఇప్పుడు వివాదంగా మారింది.
ఎగ్జిమ్ బ్యాంక్‌పై ఏపీ నోటీసులు
పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించిన 4,495 కోట్ల కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయంటూ ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈమేరకు కంపెనీకి నోటీసులు ఇచ్చింది. ఇక, వెస్టిండీస్‌కు చెందిన వివాదాస్పద ఎగ్జిమ్ బ్యాంకు నుంచి రూ. 80 కోట్ల బ్యాంకు గ్యారెంటీలను రాఘవ కంపెనీ సమర్పించడాన్ని కూడా ఏపీ సర్కారు తప్పుబట్టింది. భారత్‌కు చెందిన మరేఇతర బ్యాంకు నుంచి గ్యారెంటీలు సమర్పించాల్సిందిగా నోటీసులు ఇచ్చింది.
ఫెమా ఉల్లంఘన కేసులు కూడా
పొంగులేటి కంపెనీల చుట్టూ ముసురుకున్న ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారెంటీలు, లగ్జరీ వాచీలు, బోగస్ కంపెనీలు-టీడీఎస్ కేసులు మనీలాండరింగ్ చట్టంతో పాటు ఫెమా (ఫారెన్ ఎక్షేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్) ఉల్లంఘనల కిందకు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. విదేశీ మారకం, విదేశీ బ్యాంకులు, ఎగుమతులు-దిగుమతులు, గూడ్స్ అండ్ సర్వీసులకు సంబంధించిన అక్రమాలు ఫెమా చట్టం కిందకే వస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఈడీ సోదాల కంటే ముందు..?
పొంగులేటి కుటుంబానికి చెందిన నివాసాలు, ఆఫీసులపై ఈడీ శుక్రవారం ఉదయం సోదాలు జరుపడానికి ముందు పెద్ద కసరత్తు జరిగినట్టు ఢిల్లీలోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కి చెందిన రెండు బృందాలు పొంగులేటి కంపెనీలు, ఆస్తులపై వివరాలను సేకరించినట్టు సమాచారం.
స్టెప్ – 1
కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పొంగులేటి కంపెనీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎఫ్ఐయూ సేకరించింది.
స్టెప్ – 2
ఎనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పొంగులేటి కంపెనీలు మనీలాండరింగ్, ఇతరత్రా తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాయా? లేదా? అనే వివరాలను ఎఫ్ఐయూ పూర్తిగా విశ్లేషించింది.
స్టెప్ – 3
షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ -పొంగులేటి కంపెనీలకు సంబంధించిన ఆర్థిక నేరాల ఆరోపణల చిట్టాను ఎఫ్ఐయూ ఈడీ అధికారులకు చేరవేసింది.
స్టెప్ – 4
ఎఫ్ఐయూ నుంచి కచ్చితమైన సమాచారం అందుకున్న ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం పొంగులేటి కుటుంబం నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు.