హైదారాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని హీరా గ్రూప్ కంపెనీల్లో శనివారం నిర్వహించిన సోదాల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. నగరంలోని ఐదు ప్రాంతాల్లో కంపెనీ డైరెక్టర్ నౌహెరా షేక్, బినామీల ఇండ్లల్లో జరిపిన సోదాల్లో రూ.90 లక్షల నగదు, 12 కార్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.45కోట్ల విలువైన 13 ఆస్తి పత్రాలు, మరో రూ.25 కోట్ల విలువైన 11 ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీటితోపాటు యూఏఈలో స్థిర, చరాస్తులను కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. తమ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే 36 శాతం అధిక రాబడి వస్తుందని నమ్మించి సుమారు రూ.400 కోట్లను సంపాదించారని కంపెనీ డైరెక్టర్‌పై అభియోగాలున్నాయి. ఈ కేసులో గతంలో నౌహెరా షేక్‌ను అరెస్టు చేయగా, తాజాగా సోదాలు నిర్వహించి ఆస్తులు జప్తు చేశారు. కేసు విచారణలో ఉందని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.