హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : మకావ్ నుంచి లగ్జరీ వాచ్‌ల దిగుమతిని ముఖ్యనేత రాడార్ పసిగట్టిందా? రూ.5 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్‌లో రికార్డు అయ్యిందా? ‘లగ్జరీ రిస్ట్‌వాచ్ ఫిబ్రవరి 5న చెన్నైకి వస్తుంది’ అని ఫోన్ ట్యాపింగ్ విశ్లేషణలోనే బయటపడిందా? పక్కా నిర్ధారణతోనే చెన్నై కస్టమ్స్ అధికారులకు తెలంగాణ నుంచి ఫోన్ వెళ్లిందా? అంటే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కలకలం నేపథ్యంలో నిరుడు సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని ఓ కీలక మంత్రి, ఆయన బంధువుల ఇండ్లపై జరిగిన ఈడీ రైడ్స్ తెరమీదకొచ్చాయి.
కీలక మంత్రి అకౌంటెంట్ ఫోన్ ట్యాపింగ్‌తోనే లగ్జరీ రిస్ట్వాచ్ల స్మగ్లింగ్ గుట్టు బయటికి వచ్చిందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఊపందుకున్నది. ముఖ్యనేతతో విభేదాలేవీ లేకున్నా అనతి కాలంలోనే ఆర్థిక శక్తిగా ఎదిగిన ఆయన భవిష్యత్తులో తనకు ముప్పుగా మారే ప్రమాదం ఉన్నదని గుర్తించిన ముఖ్యనేత వర్గం సదరు మంత్రి, ఆయనకు సంబంధించిన కీలక సిబ్బందిపై నిఘా పెట్టినట్టు సమాచారం. రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఊహించనంత ఆర్థిక తోడ్పాటును అందించారనే ప్రచారం ఉన్న సదరు నేత.. పార్టీ అధికారంలోకి రాగానే నంబర్ టూ స్థాయికి ఎదిగారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
అదే సమయంలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయని, ఈ నేపథ్యంలో హర్యానా ఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ఆరునెలల ముందుగానే సదరు నేతను అధిష్ఠానం ఢిల్లీకి పిలిచినట్టు సమాచారం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఖర్చులో కొంత భాగాన్ని సమకూర్చే బాధ్యత ఢిల్లీ అధిష్ఠానం తెలంగాణకు చెందిన కీలక నేతలకు అప్పగించినట్టు తెలిసింది.
ఇదే ముఖ్యనేతకు కంటగింపుగా మారినట్టు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఓవైపు తాను అధికారిక కార్యక్రమాల మీద ఢిల్లీకి వెళ్లినప్పుడు ఉప ముఖ్యమంత్రిని తోడు తీసుకెళ్లాలని ఆంక్షలు పెట్టడం, ఇంకో వైపు ఢిల్లీ ఆర్థిక అవసరాల కోసం నంబర్ టూ మీద ఆధారపడటంతో అనుమానం వచ్చిన ముఖ్యనేత.. మంత్రుల మీద నిఘా పెట్టడం మొదలు పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్, జీపీఎస్ డిటెక్టింగ్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కదలికలపై నిఘా పెట్టినట్టు చర్చ నడుస్తున్నది.
ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో సదరు కీలక మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు తీసుకున్నది. ఈ పనులకు సంబంధించి కరేబియన్‌కు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు ష్యూరిటీ ఇచ్చింది. గత ప్రభుత్వం ఈ ష్యూరిటీలను అంగీకరించింది. అనంతరం వచ్చిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ఈ అంశాన్ని హైలైట్ చేసింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ ష్యూరిటీ మీదనే ఎలా దృష్టి పెట్టిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! అది మొదలు వరుసగా లగ్జరీ రిస్ట్ వాచ్‌లు, హిమాయత్‌సాగర్‌లో ఆయన ఇంటి మీద ఆరోపణలు, ఈడీ దాడుల వ్యవహారాల పరంపర కొనసాగింది. సొంత పార్టీలోని ‘ముఖ్య’ నేతే పక్కా పథకంతో ఇరికించారని అప్పట్లో సదరు కీలక మంత్రి సన్నిహితులు బహిరంగంగానే ఆందోళన వ్యక్తంచేశారు. తాజాగా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు బయటపడటంతో నాటి ఈడీ దాడుల వెనుక ఫోన్ ట్యాపింగ్ ఉన్నదని మంత్రి సన్నిహితులు అంటున్నారు. పక్కాగా ఫోన్ సంభాషణ విన్నారు కాబట్టే ముబిన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 5న చెన్నైకి వస్తున్నారని తెలిసి, అక్కడి కస్టమ్స్ అధికారులకు ఉప్పందించినట్టు, తెలంగాణ నుంచే కస్టమ్స్‌కు ఫోన్ వెళ్లినట్టు తమకు తర్వాత తెలిసిందని కీలక మంత్రి సన్నిహితులు చెప్తున్నారు.
మరోవైపు సదరు కీలక మంత్రి చేసిన ప్రతి లాండ్ డీలింగ్ వివరాలు కూడా ముఖ్యనేత గుప్పిట్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఖరీదైన ప్రాంతంలో ప్లాట్ దగ్గర నుంచి మొదలు పెట్టి నగరం శివారులో ఆయన సెటిల్మెంట్ చేసి తీసుకున్న ఇంచు భూమి వివరాలు కూడా ముఖ్యనేత వద్ద ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది. ఆయా వివాదాస్పద భూ ములకు సంబందించిన డాక్యుమెంట్లు, సెటిల్మెంట్ల పురోగతి నివేదికలు తీసుకొని యువ ఎమ్మెల్యేకు ఇచ్చినట్టు ప్రచా రం జరుగుతున్నది.
ఈ ముఖ్యనేత ఇచ్చిన తోడ్పాటుతోనే గతంలో ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సీఎల్పీ సమావేశంలో యువత ఎమ్మెల్యే రెండు ఫైళ్లలో డాక్యుమెంట్లు తీసుకొని సదరు కీలక మంత్రిపై పరోక్షంగా అవినీతి ఆరోపణలు చేసింది బహిరంగ రహస్యమే. యువనేతకు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సదరు కీలక మంత్రి భూ సెటిల్మెంట్ వ్యవహారం బయటికి వచ్చిందని ఆయన అనుచరులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ చేపట్టాని సదరు మంత్రి సన్నిహితులు డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థిక తోడ్పాటు అందించటం ద్వారా సదరు మంత్రి సొంత ఎమ్మెల్యేల బలం పెంచుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు బహిరంగంగానే చెప్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆయన బల ప్రదర్శన చేస్తే 25మంది ఎమ్మెల్యేలు ఆయన వెనుకే ఉంటారని కాంగ్రెస్ వర్గాలే అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఇప్పుడున్న ముఖ్యనేతను అధిష్ఠానం పూర్తిస్థాయిలో నమ్మడం లేదు.
ఢిల్లీ అవసరాలకు అనుగుణంగా నడుచుకోలేక ఎప్పుడు కాడి పడేస్తారోనన్న అనుమానంతోనే ఉన్నట్టు తెలుస్తున్నది. మరో వైపు ఆయన బడే భాయ్‌కి దగ్గరగా ఉండడం, ఇక్కడి బీజేపీ నేతలు ప్రభుత్వంతో అంటకాగుతుండటం కూడా అధిష్ఠానానికి మింగుడుపడనివ్వడం లేదని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైనా జరగరానిది జరిగితే..ఆర్థిక, సామాజిక పరంగా సదరు మంత్రి ముందు వరుసలో ఉంటాడని ముఖ్యనేత వర్గం ఆందోళన చెందినట్టు సమాచారం.