హైదరాబాద్: ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో రెండు గంటలుగా విచారణ కొనసాగుతున్నది. అంతకుముందు గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. జై తెలలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో మన్నె క్రిశాంత్, పల్లె రవికుమార్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి స్టేషన్లకు తరలించారు. సుమారు వంద మంది కార్యకర్తలు ఈడీ కార్యాలయం నుంచి వివిధ పీఎస్‌లకు తీసుకెళ్లారు.
కాగా, కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈడీ ఆఫీసు ముందు ఉన్న రోడ్డుపై వాహనాలను అనుమతించడం లేదు. గన్‌పార్క్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మరో మార్గంలోకి మళ్లిస్తున్నారు. కేవలం ఆయ్కార్ భవన్ మీదుగా వచ్చే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు.