మేడ్చల్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ)/దుండిగల్: ‘ఐటీ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. మానసికంగా టార్చర్ చేస్తున్నారు. మేం బ్లాక్ దందా చేస్తున్నామా? హవాలా బిజినెస్ చేస్తున్నామా? క్యాసినో నిర్వహిస్తున్నామా? 20 ఏండ్లుగా విద్యాసంస్థలు నడిపిస్తున్నాం. సీఆర్పీఎఫ్ పోలీసులు నా పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డిని కొట్టడంతో భయభ్రాంతులకు గురై ఛాతినొప్పి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దవాఖానలో చికిత్స పొందుతుంటే కూడా అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం’ అని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐటీ తనిఖీల నేపథ్యంలో అధికారుల తీరును తప్పుబట్టారు.
బుధవారం బోయిన్‌పల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తామేమీ దొంగ దందాలు చేయలేదని చెప్పారు. తనిఖీలకు అభ్యంతరం లేదని, మానసికంగా హింసిస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందునే తనతోపాటు కుటుంబ సభ్యుల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యాసంస్థలు నెలకొల్పిన నాటి నుంచి తక్కువ ఫీజుతో ఇంజినీరింగ్ విద్య అందిస్తున్నామని చెప్పారు. దవాఖానల్లో నిరుపేదలకు ఉచిత వైద్యసేవలు అందించడం నేరమా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆశ్వీరాదంతో ప్రజలకు సేవలు చేస్తున్నామని తెలిపారు. కనీవిని ఎరుగనిరీతిలో తన ఇంటితో పాటు కుమారులు, బంధువుల ఇండ్లలో రెండు వందల మంది ఐటీ అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. కక్ష సాధించేందుకే ఐటీ తనిఖీలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఛాతినొప్పితో దవాఖానకు వెళ్లారనే విషయాన్ని టీవీలో చూశానని తెలిపారు. ప్రెస్‌మీట్ తర్వాత వెంటనే కుటుంబసభ్యులతో కలిసి వైద్యశాలకు చేరకుని మహేందర్‌రెడ్డి ఆరోగ్యంపై మల్లారెడ్డి ఆరా తీశారు. మానసిక ఒత్తిడి, అనారోగ్యంతో దవాఖానలో చేరిన వీరి సమీపబంధువు ప్రవీణ్‌రెడ్డి బుధవారం సాయంత్రం డిశ్చార్జి కాగానే ఐటీ అధికారులు నేరుగా దూలపల్లిలోని అతని ఇంటికి తీసుకెళ్లి విచారించారు.
రెండోరోజూ తనిఖీలు
ఆందోళనలు, నిరసనల మధ్య బోయిన్‌పల్లిలో మంత్రి మల్లారెడ్డి నివాసంలో రెండోరో జు ఐటీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మంత్రి అల్లుడు, మల్కాజిగిరి టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఆయన సోదరుడు గోపాల్‌రెడ్డి, కొంపల్లిలో నివాసముండే బం ధువులు సంతోష్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, సుచిత్రలోని త్రిశూల్‌రెడ్డి ఇండ్లలో ఐటీ తనిఖీలు కొనసాగాయి. మర్రి రాజశేఖర్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో నగదు లభించినట్టు వచ్చిన వార్తలపై ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం
మేడ్చల్వ్యాప్తంగా నిరసనలు
మేడ్చల్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాజకీయ కక్షతో మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు చేపట్టి మానసికంగా హింసిస్తున్నారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారంవారు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా నిరసన తెలిపారు. బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే బీజేపీ కక్ష సాధిస్తున్నదని టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. టీఆర్ఎస్ను అణగదొక్కాలని చూస్తే బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని నాయకులు హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెట్ట డం ఆపకుంటే బీజేపీ నాయకులు బయ ట తిరగలేరని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి మంత్రికి మద్దతు తెలిపారు.