హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): బెట్టింగ్యాప్స్ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలో విచారించనున్నది. ఈ మేరకు సోమవారం నుంచి పలువురికి విచారణకు సంబంధించిన నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. తొలిరోజు నుంచి చివరిరోజు వరకూ ఎవరెవర్ని పిలువాలి?, వారిలో విదేశాల షూటింగ్లో ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారా?, వారి కాల్షీట్స్ వివరాలను ఈడీ తెలుసుకుంటున్నది.
ఒకవేళ షూటింగ్ షెడ్యూల్లో ఉన్నవారు విచారణకు రాలేనని మరో తేదీ కావాలని కోరితే.. వారికి డేట్స్ ఇచ్చేందుకు సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. వివాదాస్పద బెట్టింగ్యాప్స్ ప్రమోట్ చేశారంటూ ప్రముఖ సినీనటులు ప్రకాశ్‌రాజ్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో సహా మొత్తం 29మంది ప్రముఖులు, బెట్టింగ్యాప్స్ నిర్వాహకులపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.