హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సినీ, టీవీ, సోషల్‌మీడియా ప్రముఖులు, బెట్టింగ్యాప్స్ నిర్వాహకులు సహా 29 మందిపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. వారి విచారణకు రంగం సిద్ధంచేసింది. సోమవారం పలువురికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న దగ్గుబాటి రానా, 30న ప్రకాశ్‌రాజ్, ఆగస్టు 6న విజయ్‌దేవరకొండ, 13న మంచు లక్ష్మిని విచారణకు రావాలని పిలిచింది. హీరోయిన్లు ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, టీవీ యాంకర్లు శ్రీముఖి, రీతుచౌదరి, విష్ణుప్రియ, శ్యామల, ఇన్ఫ్లుయెన్సర్లు హర్షసాయి, భయ్యా సన్నీయాదవ్తోపాటు మరికొందరి పేర్లు కూడా ఈడీ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి.
కేసు పూర్వాపరాల్లో కి వెళ్తే.. మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త పీఎం ఫణీంద్రశర్మ బెట్టింగ్ యాప్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలెబ్రిటీలు ప్రచారం చేయడం వల్ల బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడి చాలామంది నష్టపోతున్నారని పేర్కొన్నారు. తీవ్రంగా నష్టపోయిన చాలామంది యువకులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు సాగిస్తున్నది.