హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారన్న కేసులో పలువురు సినీ ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసీఐఆర్ నమోదు చేసింది. సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. సినీనటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి సహా 29 మంది ప్రముఖులు, యాప్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసింది. ఈ జాబితాలో హీరోయిన్లు ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, టీవీ ఆర్టిస్టులు శ్రీముఖి, రీతూచౌదరి, విష్ణుప్రియ, సిరి హనుమంతు, సుప్రీత, నైని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, వర్షిణి సౌందర్‌రాజన్, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి ఉన్నారు. వీరందరికీ ఈడీ నోటీసులు జారీ చేసిందని, త్వరలోనే విచారణకు పిలువనుందని సమాచారం.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఫణీంద్రశర్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్‌ల ద్వారా ప్రజలను జూద వ్యసనంలోకి లాగుతున్నాయని ఫణీంద్రశర్మ పేర్కొన్నారు. నష్టపోయిన కొందరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు నడుస్తున్నది. ఈ కేసుల ఆధారంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. గతంలో పలు గేమింగ్ యాప్స్‌కు ప్రమోట్ చేసినప్పటికీ ప్రస్తుతం వాటితో ఒప్పందాలు రద్దయ్యాయని రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్ ఇటీవలే స్పష్టంచేశారు.
బెట్టింగ్ యాప్స్‌ను వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా గళం వినిపిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. ఈడీ రంగంలోకి దిగిన సందర్భంగా ఎక్స్‌లో స్పందించారు. ‘తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ.. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న వీళ్లా సెలబ్రెటీలు? సమాజ శ్రేయస్సుకు నాలుగు మంచి పనులు చేసి, యువతకు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు.. బెట్టింగ్ యాప్‌లకు బానిసలను చేసి చాలామంది యువకుల మరణాలకు కారణమయ్యారు. ఇది ధోరణి సరైనది కాదు’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇక నుంచైనా యాప్స్‌ను ప్రమోట్ చేసే ముందు ఆలోచన చేయాలని కోరారు.