Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇండ్లలో రెండ్రోజులుగా ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జరిపిన సోదాల్లో మొత్తం ఐదు రకాల ఆర్థిక నేరాలు, రూ.వందల కోట్ల లావాదేవీలు, క్రిప్టో ఖాతాల వివరాలు వెలుగులోకి రావడంతోపాటు భారీగా డబ్బు, ఎన్నో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ సామగ్రి పట్టుబడినట్టు తెలుస్తున్నది. దీంతో వాటిపై అధికారులు లోతైన విశ్లేషణ చేస్తున్నారు. ఇంత భారీగా అక్రమ లావాదేవీలు ఎలా జరిగాయి? ఎందుకు జరిగాయి? పట్టుబడిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి తరలించబోతున్నారన్న వివరాలతోపాటు ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారెంటీలు, పన్ను ఎగవేతలు, ప్రాజెక్టులకు నిధుల మళ్లింపు, వాచీల స్మగ్లింగ్, మనీలాండరింగ్ తదితర అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
ఆ లీకు వీరులు ఎవరు?
కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగంలోని ఐఎఫ్యూతోపాటు చెన్నైలోని కస్టమ్స్, ఐటీ అధికారులు ఇచ్చిన పక్కా నివేదికల ఆధారంగా హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ఈడీ బృందం రాబోతున్నదన్న విషయం ముందుగానే బయటకు పొక్కినట్టు తెలుస్తున్నది. గురువారం అర్ధరాత్రే ఈ సమాచారం లీక్ కావడంతో శుక్రవారం ఉదయమే మంత్రి పొంగులేటితోపాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇండ్లు, కార్యాలయాల నుంచి పలు కీలక ఫైళ్లను వేరేచోటికి తరలించినట్టు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్న ఈడీ అధికారులు.. తమ సోదాల విషయాన్ని ముందుగానే లీక్ చేసినవారిపై కూడా దృష్టి సారించారు. ఆ లీకు వీరులను పట్టుకునేందుకు ఏకంగా ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించినట్టు తెలిసింది.
మిస్సయిన కీలక ఫైళ్ల కోసం ఈడీ ఆరా
శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌లోని మంత్రి పొంగులేటి బంధువుల ఆఫీసుల నుంచి భారీ మొత్తంలో డబ్బుతోపాటు పలు కీలక ఫైళ్లు, అనేక దస్ర్తాలు, సీపీయూలు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, ఇతర డిజిటల్ సామగ్రిని రెండు ఇన్నోవా కార్లలో రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తున్నది. దీంతో వాటిని ఎక్కడికి తరలించారన్న దానిపై ఢిల్లీ ఈడీ అధికారులు దృష్టి సారించడంతోపాటు ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనాలపై హైదరాబాద్ ఈడీ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం.
తనయుడి క్రిప్టో ఖాతాలపై నజర్
ఖరీదైన వాచ్‌ల స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనయుడు హర్షారెడ్డి క్రిప్టో ఖాతాలపై కూడా ఈడీ అధికారులు దృష్టిసారించినట్టు తెలిసింది. ‘టెథర్’ అనే క్రిప్టో వాలెట్ ద్వారా హర్షారెడ్డి భారీగా అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఈడీ అధికారుల దృష్టికి రావడంతో అసలు ఆయనకు ఎన్ని రకాల క్రిప్టో అకౌంట్లు ఉన్నాయి? వాటి ద్వారా ఎన్ని లావాదేవీలు జరిగాయి? వాటిలో వాచీల స్మగ్లింగ్‌కు సంబంధించిన లావాదేవీలు ఎన్ని ఉన్నాయి?, ఈ లావాదేవీలకు స్థానిక క్రిప్టో హవాలా వ్యాపారులు ఎవరైనా సహకరించారా? అనే వివరాల కోసం కూపీ లాగుతున్నారు. కాగా, గత రెండ్రోజుల సోదాల్లో పట్టుబడిన డబ్బు, డాక్యుమెంట్లు, డిజిటల్ సామగ్రి, క్రిప్టో వ్యాలెట్ల వివరాలను ఈడీ అధికారులు సోమవారం లేదా మంగళవారం అధికారికంగా వెల్లడించనున్నట్టు తెలుస్తున్నది.