హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో వాయువేగంగా జరుగుతున్న తాజా పరిణామాలు బీజేపీతో రేవంత్‌రెడ్డి కుమ్మక్కు రాజకీయాలను బట్టబయలు చేస్తున్నాయి. ఆ జోడీ బంధానికి ఈడీ దూకుడే సాక్షమని స్పష్టమవుతున్నది. ఫార్ములా ఈ-రేస్‌లో కేటీఆర్‌పై గురువారం సాయంత్రం ఏసీబీ కేసు నమోదు చేసిన కొద్ది గంటల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం కేసు నమోదు చేయడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. ఫార్ములా ఈ-రేస్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ టు బ్యాంక్ జరిగాయని, ఇందులో అవినీతికి ఆస్కారమే లేదని, అవినీతే లేనప్పుడు ఏసీబీ విచారణ ఎందుకని, అసలు ఏసీబీ కేసు నిలుస్తుందా? అని ఓవైపు వాదనలు కొనసాగుతున్నాయి.
మరోవైపు కేసులో అవినీతి కోణం ఉన్నదా? లేదా? అన్న విషయాన్ని న్యాయస్థానం తేల్చాల్సి ఉన్నది. కేటీఆర్‌పై నమోదైన కేసులో ఏసీబీ ప్రాథకమి విచారణ ప్రారంభించకముందే ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద ఈడీ రంగ ప్రవేశం చేయటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీతో కుమ్మక్కు కారణంగానే కొన్ని గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌ను తద్వారా బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలనే వ్యూహంతోనే రేవంత్‌కు కేంద్రంలోని బీజేపీ అండగా నిలిచిందన్న విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వటంలేదనేది పలుసార్లు స్పష్టమైంది. అదే సమయంలో కేంద్రమంత్రులను మాత్రం రేవంత్‌రెడ్డి అలవోకగా కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నదని, సీఎం రేవంత్‌రెడ్డి ఆశ్రితపక్షపాతం చూపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదులను కేంద్రం బుట్టదాఖలు చేస్తూ వస్తున్నది.