హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దశలోనూ కచ్చితత్వం, జాగ్రత్త, సమయపాలన పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై శనివారం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో)లతోవీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతి, పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ జాబితా ఆధునీకరణ, ఫిర్యాదులు, అభ్యంతరాలు, పరిషారాలు, ఫీల్డ్ ధ్రువీకరణ, డాటా ఎంట్రీ కచ్చితత్వం వంటి ముఖ్య అంశాలపై సీఈవోకు నివేదికలు సమర్పించారు. ఎస్ఐఆర్కు సంబంధించిన పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఈవో అధికారులను ఆదేశించారు. తప్పులకు తావు లేకుండా సమగ్రంగా ఓటర్ జాబితా రూపొందించాలని సూచించారు. సమీక్షలో డిప్యూటీ సీఈవో హరిసింగ్, సీఈవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.