పరిగి, ఆగస్టు 14 : భూకంపంతో వికారాబాద్ జిల్లా వాసులు వణికిపోయారు. పరిగి మండలం బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్, హనుమాన్‌గండి గ్రామాలతోపాటు పరిగి పట్టణం, పూడూరు మండలం కెరెవెళ్లి, దేవనోనిగూడ, సోమన్గుర్తి గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున వచ్చిన భూ ప్రకంపనలతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓవైపు వర్షాలతో చల్లటి వాతావరణంలో గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున 3.50 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దాలతో పాటు భూమి సుమారు 3 నుంచి 4 సెకన్లపాటు కంపించినట్టు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. ఇంట్లోని వంట సామగ్రి, ఖాళీ గిన్నెలు కింద పడిపోవడంతో ఉలిక్కిపడి లేచిన ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. పూడూరు మండలం చన్గోముల్ శివారులోని పంటపొలాల్లో భూకంపం కేంద్రీకృతమైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ గుర్తించినట్టు సమాచారం. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైనట్టు పేర్కొన్నారు.