హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. గత నెల 21, 22 తేదీల్లో ముండ్లమూరు మండలంలోని శింగన్నపాలెం, వేంపాటు, పెద్దఉల్లగల్లు, పసుపుగల్లు గ్రామాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. గురువారం కూడా ఇదే మండలంలోని పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు గ్రామస్థులను ఆందోళనకు గురిచేశాయి.