లద్దాఖ్ : వాయువ్య కశ్మీర్లో ఆదివారం ఉదయం 11.51 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూంకంప సంభవించిందని భూకంప అధ్యయన శాస్త్ర జాతీయ కేంద్రం (ఎన్సీఎస్) సోమవారం వెల్లడించింది. లేహ్-లద్దాఖ్ కేంద్రంగా 171 కి.మీ లోతులో హిమాలయాల ప్రాంతంలో భూమి కంపించింది. భూకంపం వల్ల నష్టం సంభవించినట్టు వార్తలేమీ రాలేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
శాంటియాగో: దక్షిణ చిలీలో కార్చి చ్చు బీభత్సం సృష్టిస్తున్నది. కార్చిచ్చు కారణంగా 19 మంది మృతిచెందారు. మంటల కారణంగా 50 వేల మందికి పైగా ప్రజలు వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు. రాజధాని శాంటియాగోకు దక్షిణాన సుమారు 500 కి.మీ దూరంలోని నుబుల్, బిబియో ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ ఈ దావానలం మొదలైంది. వేడి వాతావరణం, బలమైన గాలుల వల్ల మంటలు తీవ్రంగా వ్యాపించాయి. దీంతో దేశాధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ నుబుల్, బిబియోలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 4 వేల మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నట్టు ఆయన తెలిపారు.