వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో (Vikarabad) ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు భూ ప్రకంపణలు అలజడి సృష్టించాయి. గత రెండు రోజులుగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగుల ఉధృతికి వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పూడూరు మండలం, చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఈసీ వాగు జోరుగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో అంపల్లి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. భారీగా వరద నీరు రావడంతో కోటపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారి అలుగుపోస్తున్నది. దీంతో నాగసమందర్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదిలా ఉండగా గురువారం తెల్లవారుజామున పరిగి మండలంలో భూమి కంపించింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్నగర్లో ప్రకంపణలు వచ్చాయి. తెల్లవారుజామున 3.47 గంటల సమంయలో 3 నుంచి 4 సెకన్ల పాటు భూకంపం వచ్చింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా, గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. 2024 ఫిబ్రవరిలో 2.5 తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) నిర్ధారించింది. 2022లో కూడా జిల్లాలోని పరిగి మండలంలో భూమి కంపించింది.