హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న బ్రేక్ఫాస్ట్ పథకానికి బాలారిష్టాలు తప్పడంలేదు. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ పథకం అమలయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. ప్రస్తుతానికి కొన్ని స్కూళ్లల్లో.. అది కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లలో మాత్రమే ప్రారంభించే యోచనలో అధికారులు ఉన్నారు. పథకం అమలుకు పాఠశాల విద్యాశాఖ మెనూను రూపొందించగా, ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలుపలేదు. ఈ ఫైల్ సర్కార్ పరిశీలనలో ఉన్నది. స్కూళ్లే కాకుండా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా బ్రేక్ఫాస్ట్ అమలుచేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. జూన్ 1న కాలేజీలు ప్రారంభమైనా బ్రేక్ఫాస్ట్ పథకం అమలుకాలేదు. ఈ నెల 15 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కాబోతున్నాయి. తొలిరోజే బ్రేక్ ఫాస్ట్ అందుతుందో.. లేదో అనుమానమే. .
మార్కెట్ యార్డు స్థలాల్లో కిచెన్లు
కొత్త విద్యాసంవత్సరం నుంచి సర్కార్ స్కూళ్లు, ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు గల 20.32 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, పాలు అందజేస్తామని పేర్కొన్నారు. బ్రేక్ఫాస్ట్ కోసం రూ.540 కోట్లు, పాల కోసం రూ.180 కోట్లు కేటాయించారు. అయితే స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ పథకం, జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించాల్సి ఉన్నది. రాష్ట్రమంతటా బ్రేక్ఫాస్ట్, ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన తయారీని సెంట్రలైజ్డ్ కిచెన్లు ద్వారా చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 39 సెంట్రలైజ్డ్ కిచెన్లు అవసరమని భావిస్తున్నారు.
వీటిని మార్కెట్ యార్డు స్థలాల్లో నిర్మించనున్నారు. కిచెన్ల నిర్మాణానికి రూ.299 కోట్లు వెచ్చించనున్నారు. ఇందుకు అయ్యే వ్యయంలో ప్రభుత్వం 70% నిధులు భరించనుండగా, మిగిలిన 30% నిధులను టెండర్ దక్కించుకున్న సంస్థ వెచ్చించాల్సి ఉంటుంది. టెండర్ ప్రక్రియలో భాగంగా టీజీఈడబ్ల్యూఐడీసీ ఆసక్తి గల సంస్థలను ఆహ్వానించింది. టెండర్ల దాఖలు గడువు శనివారంతో ముగిసింది. సోమవారం టెండర్ బిడ్లను తెరువనున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లోని స్కూళ్లలో మాత్రమే బ్రేక్ఫాస్ట్ అందించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.