Lok sabha Elections | లోక్సభ ఎన్నికలు ముందస్తుగా జరగనున్నాయా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టిసారించగా.. అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓటర్ల తుది జాబితాను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్ణీత గడవు కన్నా ముందే వస్తాయని పార్టీ ముఖ్యనేతలకు ఆయన సంకేతాలు ఇచ్చారు.
ఇందుకు అనుగుణంగా తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జులను కూడా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ప్రకటించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై కూడా కసరత్తు చేస్తున్నది. డిసెంబర్ ఆఖరుకల్లా గ్యారెంటీల అమలు మొదలుపెట్టకపోతే లోక్సభ ఎన్నికలయ్యే వరకు ఇబ్బందవుతుందని ఆ పార్టీ భావిస్తున్నది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండోవారంలోపే వస్తుందని, అప్పుడు మే వరకు గ్యారెంటీల అమలు సాధ్యం కాదని భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా 6-7 విడుతల్లో ఎన్నికలు జరుగుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనవరి 24వ తేదీతో అయోధ్యరామాలయం ప్రారంభిస్తున్నారు. రామాలయం ప్రారంభించిన తర్వాత పార్లమెంటులో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టినున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా మొత్తం 6 లేదా 7 విడుతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. తొలిదశలోనే తెలంగాణ ఎన్నికలుంటాయని విశ్లేషకులు చెప్తున్నారు. తొలిదశ ఎన్నికలు ఏప్రిల్ పదో తేదీలోపే ఉంటాయని, తెలంగాణలో ఏప్రిల్ తొలివారంలోనే ప్రక్రియ పూర్తవుతుందని చెప్తున్నారు. మలిదశ పోలింగ్ మే తొలివారం వరకు ఉంటుందని, ఫలితాలు మే 15 లోపే ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.