న్యూస్ నెట్వర్క్, నవంబర్ 18 : ‘చలో కొడంగల్’కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయా చోట్ల పోలీసులు గిరిజన సంఘాలు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. సోమవారం మహబూబాబాద్‌లో పోలీసులు లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమానాయక్ మాట్లాడుతూ అక్రమ అరెస్ట్‌లతో గిరిజనుల ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాలాజీనాయక్, భారతీయ గోర్ బంజారా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవిచందర్ చౌహాన్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేశ్‌ను టేకులపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం అర్ధరాత్రి, సోమవారం ఉదయం బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. లగచర్లలో గిరిజనుల అరెస్టుకు నిరసనగా ‘చలో కొడంగల్’ కార్యక్రమానికి వెళ్తుండగా ఠాణాకు తరలించారు. నిర్మల్ జిల్లా పెంబీ మండలంలో లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు.. ఇంద్రవెల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకులను, గుడిహత్నూర్‌లో బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అరెస్టు చేశారు.